హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని 19.95 ఎకరాల భూమిలో అభివృద్ధి చేసిన రాడిసన్, మెరీడియన్ హోటళ్లు సహా పలు వాణి జ్య, నివాస సముదాయాలు హౌసింగ్ బోర్డు స్వాధీనంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. జాయింట్ వెంచర్ ఒప్పందంలో భాగంగా హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన మొత్తాన్ని యూనివర్సల్ సంస్థ గడువు పూర్తయినా చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. సదరు ఆస్తులు తమ ఆధీనంలోకి వచ్చాయని, వాటిపై ఎటువంటి లావాదేవీలు జరపరాదని హౌసింగ్ బోర్డు హెచ్చరించింది. గచ్చిబౌలిలో హౌసింగ్‌బోర్డుకు ఐదు భాగాలుగా 19.95 ఎకరాల భూమి ఉంది. 2005 ఏప్రిల్‌లో యూనివర్సల్ రియల్టర్స్ ప్రైవే ట్ లిమిటెడ్‌తో డెవలప్మెంట్ అగ్రిమెం ట్ చేసుకొన్న హౌసింగ్ బోర్డు జనవరి 2006లో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన మొత్తాన్ని యూనివర్సల్ రియల్టర్స్ చెల్లించకపోవడంతో ఈ ఒప్పందాన్ని రద్దుచేసినట్టు హౌసింగ్ బోర్డు ప్రకటించింది. తమతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినందున ఈ ఆస్తులపై ఎటువంటి లావాదేవీలు జరపరాదని, వీటిపై ఎటువంటి రుణాలు ఇచ్చినా, ఏమైనా ఒప్పందాలు చేసుకున్నా అవి చెల్లవని అధికారులు స్పష్టంచేశారు.