హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ హబ్ ఇతర దక్షిణాది రాష్ర్టాలను కాదని ఏపీలోని విశాఖపట్టణానికి వెళ్లడం వెనుక పెద్ద కథే ఉన్నదని సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజ్‌గోపాలన్ పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో ప్రభుత్వాలు లంచాలు డిమాండ్ చేస్తున్నాయని, ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ముఖ్యనేత తన సమీప బంధువు ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు అదానీ కార్యాలయ వర్గాలే తనకు చెప్పాయని పేర్కొన్నారు.
‘ఆల్టర్నేట్ మీడియా’ యూ ట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రాజ్‌గోపాలన్ మాట్లాడుతూ.. ‘అదానీ గ్రూప్, గూగుల్‌కు మధ్య 15 బిలియన్ డాలర్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా విశాఖపట్టణంలో దేశంలోనే అతిపెద్ద ఏఐ, డాటా సెంట ర్ హబ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. అది ఇతర దక్షిణాది రాష్ర్టాలకు ఎందుకు పోలేదో తెలుసా? దాని వెనుక ఇంట్రెస్టింగ్ కథ ఉన్నది. వాళ్లు తమిళనాడు పోదామనుకుంటే అక్కడ లంచం అడిగారు. తమిళనాడులో ముఖ్యనేత అల్లుడు వసూళ్ల వ్యవహారం నడుపుతున్నారు. తెలంగాణలో ముఖ్యనేత డబ్బులు అడుగుతున్నారు. తెలంగాణలో సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గత ఏడాది అదానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సందర్భం గా ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యనేత తన సమీప బంధువు ద్వారా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు.
తమిళనా డు, తెలంగాణలో వసూళ్లు మామూలుగా లేవు. పెట్టుబడి మొత్తంలో పర్సంటేజీల చొప్పున రూ.వందల కోట్లలో వసూళ్లు చేస్తున్నారు. అదానీ కార్యాలయ వర్గాల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. అంత పెద్దమొత్తంలో వారికి ఇచ్చుకోవడంకన్నా ఏపీకి వెళ్ల డం ఉత్తమమని అదానీ పేర్కొన్నట్టు స్వయం గా వారి(అదానీ) కార్యాలయ అధికారులే నాతో అన్నారు. కర్ణాటక గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ అసలు గవర్నెన్సే లేదు. 100% లంచగొండి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ పరిస్థితులను చంద్రబాబు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వచ్చే పదేండ్లలో ఆయన విశాఖపట్టణాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులో అదానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది చాలా దీర్ఘకాల, వ్యూహాత్మక ప్రాజెక్ట్ట్. ఇండియాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్హబ్గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రాజెక్ట్’ అని పేర్కొన్నారు.