హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ) : బకాయిలు అందక అద్దె వాహనాల డ్రైవర్లు 18నెలలుగా పస్తులుంటున్నా ప్రభుత్వానికి పట్టదా..? అని తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. బకాయిలు చెల్లించాలని, ప్రతినెలా చెల్లించే అద్దెను రూ.55వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన వాహనదారులను ఉద్దేశించి సచివాలయం మీడియా పాయింట్ వద్ద కృష్ణయ్య మాట్లాడారు.
ఏడాదిన్నర నుంచి బిల్లులు పెండింగ్ పెడితే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. ఎలాంటి జాప్యం లేకుండా తమకు రావాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేసి హైర్ వెహికిల్స్ డ్రైవర్లను ఆదుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్యాదవ్, జనరల్ సెక్రటరీ మాదాసు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.