రవీంద్రభారతి, సెప్టెంబర్ 6 : పేదింటి బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేవరకు ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు అసెంబ్లీలో నిలదీయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 10న బీసీల రాష్ర్టాస్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ నేత జిల్లిపల్లి అంజి అధ్యక్షతన జరిగిన ఫీజు పోరు ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య విచ్చేసి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేక వైఖరిని విడనాడాలని హితవు పలికారు. విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉక్కుపాదం మోపుతూ జీవో నంబర్ 9ని తెచ్చి అణచివేయడానికి కుట్రులు పన్నుతున్నాడని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏటా 2వేల కోట్ల బడ్జెట్‌ను విడుదల చేశారని, అంతేకాకుండా బీసీల అభ్యున్నతి కోసం 160 గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి గందరగోళాన్ని సృష్టిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గ పాలన కొనసాగుతున్నదని, ఇలాంటి ముఖ్యమంత్రిని 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు.