రవీంద్రభారతి, మార్చి 25: బీసీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ కీలక నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ వర్గాలు పరస్పర ఆరోపణలతో రోడ్డుకెక్కాయి. బీసీ ఉద్యమాన్ని పలుచన చేసే దిశగా ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు గుప్పించుకున్నారు. మంగళవారం జాజుల వర్గం మీడియా ఎదుట ఆరోపణలు గుప్పిచంగా, ఇదేరోజు ఆర్ కృష్ణయ్య వర్గం అంతకు ముందురోజు మీడియా ఎదుట ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేల్చుకున్నారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆర్ కృష్ణయ్యపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడూ పార్టీల పంచన చేరుతూ బీసీ ఉద్యమాన్ని తాకట్టుపెట్టి వ్యక్తిగత పదవులు పొందిన ఘనత బీజేపీ నేత ఆర్ కృష్ణయ్యకే దక్కిందని, అందుకే ఆయన త్యాగ కృష్ణయ్య కాదని, రాజీ కృష్ణయ్య ఐక్యవేదిక బీసీ సంఘాల నేతలు మంగళవారం ఘాటుగా ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య తన చర్యలతో బీసీ సమాజం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జాజులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన అనుచరులతో బెదిరింపు ధోరణులు మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
సోమవారం ఆర్ కృష్ణయ్య తరఫున బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల రామూర్తిగౌడ్, ర్యాగ రమేశ్, నీల వెంకశ్, సీ రాజేశ్, అనంతయ్య, మల్లేశ్‌యాదవ్ మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మూటలకు అమ్ముడుపోయిన జాజుల శ్రీనివాస్‌గౌడ్.. ఆర్ కృష్ణయ్యపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర 25 లక్షల డబ్బు మూటలు తీసుకొని బీసీ సమాజాన్ని తాకట్టుపెట్టారని, జాజుల తీసుకున్న ఆ రూ.25 లక్షలను సాక్షాలతో సహా త్వరలో బయటపెడతామని రామ్మూర్తిగౌడ్ వెల్లడించారు.