మర్రిగూడ(నాంపల్లి), ఫిబ్రవరి 23 : ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మంజూరైన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం ప్రాజెక్టు ముంపు బాధితులు ఆదివారం ప్రాజెక్టు పనులను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ 2017లో చనిపోయిన వారితోపాటు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
సర్వే నంబర్ 327లో భూములు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. భూ నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోతే నిరవధికంగా పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.