వేములవాడ, అక్టోబర్ 25: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదటి దశ అంతరాలయంలోనే చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆలయాన్ని మొదటి దశలో రూ.76కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ప్రధాన ఆలయంలోని ఉత్తర ప్రాకారం నుంచి కోటిలింగాల వరకు, నాగిరెడ్డి మండపం నుంచి ధ్వజస్తంభం వరకు సిమెంటు పిల్లర్లు వేసి స్లాబ్ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరం వైపు ఉన్న ప్రాకారం మొత్తాన్ని తొలగించి ధర్మగుండాన్ని అంతరాలయంలోనే కలుపనున్నారు. కోటిలింగాల తొలగింపునకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి.
కోటిలింగాలను ప్రధాన రహదారి వైపు 30అడుగుల మేర విస్తరించేందుకు మొదటి దశలో స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని పెంచే పనులు చేపడుతున్నారు. మొదటి దశలో తూర్పు రాజగోపురం, అభిషేక మండపం, నిత్య కల్యాణ మండపం, ప్రాకారాలు, ఇతర నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం అంతరాలయంలోనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. రేకుల షెడ్ తొలగింపు పూర్తికావచ్చింది. భక్తుల కోసం వేసిన లైన్లను పూర్తిగా తొలగించారు. అంతరాలయంలో భారీ యంత్ర సాయంతో ఫైల్ ఫౌండేషన్ వేయనున్నారు.
గుడి బయట రాజన్న దర్శనాలకు ఏర్పాట్లు
రాజన్న ఆలయ అంతరాలయంలో పనుల నేపథ్యంలో భక్తులకు గుడి బయట దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. రాజన్న తూర్పు గోపురం ముందు స్వామివారి ప్రచార రథం, ఎల్ఈడీ స్రీన్ ఏర్పాటు చేశారు. ఒకేసారి వందలాది మంది వచ్చినా దర్శనం చేసుకునేందుకు, ఎండావాన తట్టుకునేలా భారీ షామియానా వేస్తున్నారు.