హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లపై ఈసారి నుంచి క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్షకేంద్రం ఎక్కడో సూచిస్తుంది. సెంటర్ లొకేటర్ యాప్‌తో ఈ కోడ్‌ను అనుసంధానం చేశారు. దీంతో విద్యార్థులు సులభంగా పరీక్షకేంద్రానికి చేరుకోవచ్చు. ఇంటర్ పరీక్షల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా సెంటర్లకు చేరుకునే విధానం అమలవుతున్నది. ఇదే పద్ధతిని పది పరీక్షల్లోనూ అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు ఈ సారి రికార్డు స్థాయిలో 5.27లక్షల విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరిలో 10 వేలకుపైగా ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. నిరుడు 5.09 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, ఈ సారి 16వేల మంది అదనంగా ఫీజు చెల్లించారు.