హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టు ఉన్నదని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండేండ్ల క్రితమే కాగ్నిజెంట్ సంస్థ తమ క్యాంపస్ విస్తరణకు ప్రణాళిక వేసిందని, ఆ విషయాన్ని ఆ సంస్థే ట్వీట్ చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకూ కాగ్నిజెంట్‌లో ఆయన కార్యక్రమానికి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలో వచ్చాయని చెబుతున్న పెట్టుబడులపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో కేటీఆర్ పర్యటనల సందర్భంగా రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.
కేటీఆర్ పర్యటనలను బీఆర్ఎస్ ఎప్పుడూ పబ్లిసిటీ కోసం వాడుకోలేదని అన్నారు. రేవంత్ పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు ఉత్సవ విగ్రహంగా మారారని ఎద్దేవాచేశారు. జేఎస్‌డబ్ల్యు, వెబ్‌వర్స్ అనే కంపెనీలతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటే వాటినే మళ్లీ రేవంత్ దావోస్‌లో కుదుర్చుకున్నారని తెలిపారు. సీఎం తాజా టూర్‌తో రూ.31,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారని, ఆ లెక మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో చంద్రబాబు దోస్తులు ఉన్నారని చెప్పారు. రేవంత్ విదేశీ పర్యటన ద్వారా ఏ ఏ రూపాల్లో ఎన్ని పెట్టుబడులు సమకూరాయో శ్వేత పత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను బయటపెడుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. రేవంత్ ఇప్పటికైనా గుంపు మేస్త్రీ తీరు ప్రచారాన్ని తగ్గించి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు చెప్పారు.