హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని 50 లక్షల ఆర్థిక సాయం చేశారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవతి భర్తను పరామర్శించి 50 లక్షల చెక్కును అందజేశారు. ‘రేవతి మరణం చాలా బాధకరం. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబానికి మా వంతు సాయం అందించడానికే వచ్చాం. మా అండ ఎప్పటికీ ఉంటుంది.’ అని వారు పేర్కొన్నారు.
విరాళాలు కోరిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ తెలిపింది. బాలుడి వైద్యం కోసం తమ సభ్యుల నుంచి విరాళాలు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో మరణించిన రేవతికి సంతాపం ప్రకటించారు..
సినీపెద్దలు ముందే స్పందిస్తే బాగుండేది:ఆర్యవైశ్య మహాసభ
ఖైరతాబాద్, డిసెంబర్ 23: సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనపై సినీపరిశ్రమ పెద్దలు తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి సాయం చేస్తే బాగుండేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హీరో ఒక్క రోజు జైలులో ఉండి వస్తే స్పందించిన సినీ పెద్దలు బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిందని చెప్పారు. రేవతి కుటుంబానికి ఆర్యవైశ్య మహాసభ తరఫున అండగా నిలుస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు రవికుమార్, వెంకటేశ్, శారద, సామ్రాజ్య లక్ష్మి పాల్గొన్నారు.
దాడి ఖండించిన మంత్రి కోమటిరెడ్డి
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఎక్స్ వేదికగా ఖండించారు. తొక్కిసలాట కేసు కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
బెనిఫిట్ షోలకు అనుమతులివ్వొద్దు: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సోమవారం కిమ్స్ దవాఖానలో ఆయన పరామర్శించారు. బాలుడికి వైద్యం అందుతున్న తీరుపై డాక్టర్లతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఏపీలోనూ ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.