హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి క్రిమినల్ కోర్టులు: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో పుష్ప- 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణమని నిర్ధారించారు. నటుడు అల్లు అర్జున్ రాక వల్లనే తొక్కిసలాట జరిగిందని అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలతో 25 పేజీల చార్జిషీట్‌ను 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు అభియోగపత్రం సమర్పించారు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులను ప్రధాన నిందితులుగా పేర్కొని, అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చారు.
అల్లు అర్జున్ మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితోపాటు 8మంది బౌన్సర్లను నిందితులుగా పేర్కొన్నారు. నిరుడు డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారు డు శ్రీతేజ్‌కు తీవ్రగాయాలు కాగా సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స తర్వాత రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. థియేటర్ యజమానులను నిందితులుగా పేర్కొన్నారు.