హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. వానకాలం సీజన్లో ఇప్పటివరకు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు శుక్రవారం పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీని విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని వివరించారు. మొత్తం 6,849 కొనుగోలు కేంద్రాల ద్వారా తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సీజన్లో ఇంకా 20 లక్షల టన్నుల ధాన్యం వస్తుందనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. వానకాలం సీజన్లో పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని, 14 జిల్లాల్లో 1,810 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్టు వెల్లడించారు. గతేడాది వానకాలంలో అత్యధికంగా 48.75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వానకాలం సీజన్లలో మొత్తం 2.47 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయానికి 37 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది అంతకంటే 13 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేసినట్టు తెలిపారు.