హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగిందనడానికి రెండు రాష్ర్టాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
తెలంగాణను విద్యుత్తు కోతల నుంచి బయపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపులు జరిపారు. విద్యుత్తు సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో 2014 జూలైలో తొలుత సంప్రదింపులు జరిగాయి. అధికారుల మధ్య చర్చల తర్వాత రెండు రాష్ర్టాల విద్యుత్తు సంస్థల మధ్య పీపీఏ కుదిరింది. యూనిట్ విద్యుత్తును రూ. 3.90కు కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ అవసరం లేదేమో! విద్యుత్తు కొనుగోలు ధరను నిర్ణయించే అధికారం ఛత్తీస్‌గఢ్‌కు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు మరో మెలిక పెడుతున్నారు. విద్యుత్తు చట్టం సెక్షన్ 64(5) ప్రకారం అంతర్రాష్ట్ర విద్యుత్తు ధరను.. సరఫరా చేస్తామని ముందుకొచ్చిన రాష్ట్ర ఈఆర్‌సీనే నిర్ణయించాలి.
ఇదే ప్రకారం ఛత్తీస్‌గఢ్ ఈఆర్‌సీనే విద్యుత్తు ధరను ఖరారు చేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2015 అక్టోబర్ 16న ఈఆర్సీకి లేఖను రాశారు. అందులో పలు అభ్యంతరాలు లేవనెత్తారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సారథ్యంలోని ప్రభుత్వమే పీపీఏకు ఈఆర్సీ అనుమతి లేదని అసత్య ప్రచారం చేస్తున్నది.
అసలు ఎప్పుడేం జరిగిందంటే?
విద్యుత్తు కొనుగోలు కోసం ఆ శాఖ అధికారులు 2014 జూలైలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో సంప్రదింపులు జరిపారు.
జూలై 31, 2014లో అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ విద్యు త్తు కొనుగోలు ఒప్పందాల ఖరారుకు కేసీఆర్‌తో సమావేశమయ్యారు.