Telangana | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిరుడుతో పోల్చితే 4శాతం వరకు (3 లక్షల బేళ్లు) పత్తి ఉత్పత్తి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2024-25కు సంబంధించి పంట ఉత్పత్తుల మొదటి అంచనాలను విడుదల చేసింది. నిరుడు 51 లక్షల బేళ్లకుపైగా పత్తి ఉత్పత్తి కాగా ఈ ఏడాది 48 లక్ష ల బేళ్ల పత్తి ఉత్పత్తి అయినట్టు అంచనా వేసింది. నిరుడుతో పోల్చితే సాగు కూడా 2శాతం తగ్గినట్టుగా పేర్కొన్నది. నిరుడు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈ సీజన్లో 43.76 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
ఈ ఏడాది భారీ, అకాల వర్షాలు పత్తి రైతును భారీ గా దెబ్బతీశాయి. మొదట్లో వర్షాలు పడకపోవడంతో ఇబ్బంది పడిన పత్తి రైతులు ఆ తర్వాత భారీ వర్షాలతో ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభావం పత్తి దిగుబడిపై స్పష్టం గా కనిపిస్తున్నది. సాధారణంగా ఎకరానికి 8-10 క్విం టాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. కానీ ఈ సీజన్లో 3-4 టన్నులు మాత్రమే వచ్చిందని రైతులు వాపోయారు.
ఈ ఏడాది పత్తి రైతులకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఓ వైపు ప్రకృతి పగపడితే.. మరో వైపు సర్కారు నిర్ల క్ష్యం రైతును ఇబ్బంది పెట్టింది. తొలుత వర్షాభావ పరిస్థితులు, ఆపై భారీ వర్షాలతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. ఆ తర్వాత పత్తి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు మరింత శాపంగా మారింది. నష్టపోయిన పంట పోగా చేతికొచ్చిన కాస్తో కూస్తో పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.7521 ఉండగా, ప్రై వేటు వ్యాపారులు రూ. 5500 నుంచి రూ. 6500కు మాత్రమే పత్తిని కొనుగోలు చేశారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. 25 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 11వేల టన్నుల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది.
నష్టాలను తగ్గించుకునేందుకు రైతులు తీవ్ర నిర్ణ యం తీసుకుంటున్నారు. రెండు సార్లు పంట వచ్చే అ వకాశం ఉన్నా… తొలి కాతకే పత్తి పంటను తొలగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా రైతులు పత్తి పంటను తొలగించినట్టు తెలిసింది. ఇకపై పంటను ఇలాగే ఉంచితే ఆత్మహత్యే శరణ్యమవుతుందన్నారు.
ఈ ఏడాది పత్తి రైతుల మాదిరిగానే ధాన్యం రైతులు కూడా గోస పడుతున్నారు. నిరుడుతో పోల్చితే ఈ వానకాలంలో బియ్యం ఉత్పత్తి 6శాతానికిపైగా తగ్గినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు 2023-24 వానకాలంలో 98 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా 2024-25 వానకాలంలో ఇది 92 లక్షల టన్నులకు పడిపోయినట్టు తెలిపింది. అంటే సుమారు 6 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గడం గమనార్హం. గత సీజన్లో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 65.4 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది.