ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని కేజ్రీవాల్ బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఖమ్మం సభలో తన ప్రసంగం వీడియోను కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్టు చేయగా, నిమిషాల్లోనే సుమారు 38 వేల మందిపైగా వీక్షించారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన జనాన్ని చూసి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఆశ్చర్యపోయారు. సభకు ఇంతమంది వచ్చారా? అని అక్కడి నేతలతో అన్నారు. తన సెల్ఫోన్లో సభాస్థలి, భారీగా హాజరైన జనం ఫొటోలు తీసుకొన్నారు. సభకు వచ్చిన ప్రజలను చూడాలంటే కంటి వెలుగు అద్దాలు కాకుండా, ప్రత్యేకంగా తయారుచేసిన అద్దాలు కావాలంటూ ప్రసంగంలో చెప్పడంతో అందరూ నవ్వేశారు. పలుమార్లు ఆయన చేతులు ఊపుతూ జనాన్ని ఉత్సాహపరిచారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పక్కపక్కనే కూర్చుకొన్నారు. ఇద్దరు తరచూ ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఖమ్మం పట్టణంలో, సభస్థలిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాలను, ముఖ్యమంత్రులతోపాటు తన కటౌట్ ఫొటోలను అఖిలేశ్‌యాదవ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు, సమాజ్‌వాది పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.