గజ్వేల్, ఫిబ్రవరి 15: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌తోపాటు తొగుటలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును గురువారం పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ సందర్శించనున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను సందర్శించనున్నారు. పంజాబ్ సీఎం పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు మంగళవారమే ఆయా ప్రాంతాలను సందర్శించారు.
పంజాబ్ సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 11 గంటలకు ప్రాజెక్టుకు చేరుకుంటారు. 11 నుంచి 11.30 వరకు కొండపోచమ్మ సాగర్‌ను, పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11.40 గంటలకు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్‌డ్యామ్‌కు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుకు చేరుకొని మినీట్యాంక్‌బండ్ అభివృద్ధిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.