అలంపూర్, జూలై 30 : మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 40 మంది విద్యార్థులు ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామం అలంపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్రగా బయల్దేరారు.
గురుకుల పాఠశాలలో ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య ఉంది. కొద్ది నెలలుగా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మరమ్మతులు చేయించడం లేదు. దీంతో మలవిసర్జనకు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య కూడా ఉన్నదని.. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని గత ఏడాదిగా వేడుకుంటున్నప్పటికీ అధికారుల్లో చలనం లేదని అన్నారు. ఫ్లోరైడ్ వాటర్ వస్తుండటంతో స్నానాలు, బట్టలు ఉతకడానికి పనికిరావడం లేదని చెప్పారు. ఇన్ని సమస్యల మధ్య చదువు ఎలా కొనసాగించాలని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో పాదయాత్ర చేపట్టినట్లు విద్యార్థులు వివరించారు. అలంపూర్ చౌరస్తా నుంచి ఉదయం 8 గంటలకు బయల్దేరి.. 10 గంటల వరకు జిల్లా కలెక్టరేట్‌ను చేరుకుంటామని తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు.. విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం
విద్యార్థుల పాదయాత్ర విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు.. సంబంధిత స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో స్థానిక తహసీల్దార్, ఎస్సైలు వెంటనే పాదయాత్ర చేస్తున్న విద్యార్థులను కలుసుకున్నారు. వారితో చర్చించి పాదయాత్రను విరమించుకోవాలని నచ్చజెబుతున్నారు.