హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదల కారణంగా జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున వరుణుడు శాంతించాలని రాష్ట్రమంతా పూజలు జరిగాయి. తెలంగాణ అర్చక సమాఖ్య, దేవాదాయ పాలనాధికారుల పర్యవేక్షణలో 12,000 పైచిలుకు ఆలయాల్లో వరుణ జపాలు, హోమాలు, తర్పణాలు నిర్వహించారు.
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వరుణజపం, ఇంద్రజపం చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమ సమర్పించారు. జోగులాంబ, వరంగల్ భద్రకాళి, కొండగట్టు, బాసర, కొమురవెల్లి, భద్రాద్రి, యాదాద్రి తదితర ఆలయాల్లో వరుణ జపాలు, పూజలు చేశారు. అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో సనత్నగర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో 11,000సార్లు ఇంద్రజపం, 1,100 సార్లు హోమం, 600 సార్లు తర్పణాలు నిర్వహిచారు.