నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 16: రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడంపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు క్షీరాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాలతో అభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా చండూరులో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ తాతా మధు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని అంబేద్కర్ విగ్రహానికి విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.
పీఆర్టీయూ హర్షం
నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరును ఖరారు చేయడంపై పీఆర్టీయూ హర్షం వ్యక్తంచేసింది. ఈ నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంబేద్కర్ కృషిని, త్యాగాన్ని ఎన్నడూ గుర్తించలేదు.
– వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ స్ఫూర్తిని బీజేపీ సర్కారు చాటాలి
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం దళితుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచింది. అంబేదర్ కేవలం ఒక కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. దేశంలోని 136 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర ప్రధాన పరిపాలన భవనానికి ప్రపంచ మేధావి అంబేద్కర్ పేరును పెట్టడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. అంబేదర్ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే. గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తిని బీజేపీ ప్రభుత్వం చాటాలి. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి. – మహేశ్వర్రాజు, రాష్ట్ర అధ్యక్షుడు,
ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్