హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూ విద్యార్థుల పోరాటం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించడం మూర్ఖత్వమని, అనవసరంగా మాట్లాడి ప్రభుత్వం పరువు తీసుకోవద్దని ప్రజాసంఘాల నేత గాదె ఇన్నయ్య హితవు పలికారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు తమ నోళ్లను అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. ఇండ్లలో మనం పెంచిన మొక్కలైనా పదేండ్లు పెరిగితే వాటిని నరకడానికి చట్ట ప్రకారం అటవీ అధికారుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. హెచ్సీయూలోని 400 ఎకరాల భూముల్లో వృక్షాలు, జింకలు లేవని మంత్రులు చెప్పడం వారి అవగాహన, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. రోడ్ల వెంబడి పెద్ద వృక్షాల తొలగింపు సమయంలో అటవీ అధికారుల అనుమతి తీసుకుంటారని తెలిపారు. ప్రకృతి జోలికి వెళ్తే అది మనల్నే విధ్వంసం చేస్తుందని గాదె ఇన్నయ్య హెచ్చరించారు.