Telangana | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తకు ఎర్ర తివాచీ పరుస్తూ, చిన్నతరహా పారిశ్రామికవేత్తలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యం గా సొంత జాగాల్లో చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు సైతం అనుమతులు ఇవ్వడంలేదు. సీఎం కార్యాలయం నుంచి అనుమతి రావాలంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సీఎం వద్దకు వెళ్లలేక, అనుమతులు లభించక నానా అవస్థలు పడుతున్నారు.
పారిశ్రామిక అనుమతుల మంజూరుకు సీఎం ఆఫీసుతో సంబంధం ఏమిటో అంతుబట్టడం లేదని, తమది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న పాలకులు ఇలా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. టీజీఐఐసీ వద్ద భూము లు కొనుగోలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి టీఎస్-ఐపాస్ ద్వారా ఆన్లైన్లో అన్నిరకాల అనుమతులు మంజూరవుతాయి. కానీ, సొంత జాగాలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు రెవెన్యూ, హెచ్ఎండీఏ, కాలు ష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ, ఆర్అండ్బీ, అటవీశాఖ విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుంటే అన్ని ధృవపత్రాలను పరిశీలించి తుది అనుమతులు జారీచేస్తారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సీఎంవో నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే..
ప్రస్తుతం టీజీఐఐసీ ద్వారా జరిగే భూకేటాయింపులను ఒకరిద్దరు అధికారులతోపాటు కొందరు బయటి వ్యక్తులు నియంత్రిస్తున్నా రు. మరోవైపు సొంత జాగాల్లో పరిశ్రమలు పెట్టుకునేవారి దరఖాస్తులు హెచ్ఎండీఏ వద్ద ఆగిపోతున్నాయి. కనీసం ఆ దరఖాస్తుల పురోగతి ఏమిటో, అవి ఎక్కడ చిక్కుకున్నాయో తెలుసుకునేందుకు కూడా వీల్లేకుండా పోయింది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. అన్నీ ఫైళ్లను సీఎం కార్యాలయానికి పంపామని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే అనుమతులు జారీచేస్తామని సెలవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు దరఖాస్తుదారులు సచివాలయంలో సీఎం కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించినా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడంలేదు.
పెద్దలకు మాత్రం వెంటనే అనుమతులు
కొందరు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తున్నది. ఇటీవల నల్లగొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కు అదానీ సంస్థ నుంచి దరఖాస్తు రాగానే ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీచేయడమే ఇందుకు తాజా నిదర్శనం. అదానీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వెనక్కి తగ్గని రేవంత్‌రెడ్డి సర్కారు.. చిన్నతరహా పారిశ్రామికవేత్తలను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. తమది ప్రజాప్రభుత్వమని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని పదేపదే చెప్తున్న రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చిన్నతరహా పారిశ్రామికవేత్తలను ఎందుకు వేధిస్తున్నారో అంతుబట్టడం లేదు.