ములుగు, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన రెండు క్యూ షెడ్లను ప్రారంభించక ముందే కూల్చివేశారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు సాధారణ రోజుల్లో భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.80 కోట్లతో వీటిని నిర్మించింది.
తాజాగా మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డంకిగా షెడ్లున్నాయనే నెపంతో కూల్చివేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ జాతర అనంతరం ఈ షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవల పూర్తి చేయగా ఆర్చీ ద్వారాలకు అడ్డుగా ఉన్నాయనే భావనతో 10 రోజుల నుంచి అధికారులు తొలగించే పనులు చేపట్టారు.
వీటిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సామగ్రిని భద్రపరుస్తున్నారు. 2026లో నిర్వహించే మేడారం గద్దెల ప్రాంగణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముందస్తు ఆలోచన లేకుండా క్యూ షెడ్లను నిర్మించిన అధికారులు తప్పును సరిదిద్దుకునేందుకు వాటి తొలగింపునకు పూనుకున్నారు.