హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రజల సొమ్మును మంచినీళ్లప్రాయంగా ఖర్చుచేస్తున్నారు. మంత్రులు, అధికారుల క్వార్టర్ల మరమ్మతులకు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. వారి బంగ్లాలకు రంగులు వేసేందుకు, ఫాల్స్సీలింగ్ చేయించేందుకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేస్తున్నారు. చిన్నాచితకా మరమ్మతు పనులకు సైతం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించే విలేకరుల సమావేశాలకు తాత్కాలికంగా కుర్చీలు, కార్పెట్ల ఏర్పాటు కోసం రూ.7.65 లక్షలు విడుదల చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సర్వ హంగులు, అధునాతన సౌకర్యాలతోకూడిన తెలంగాణ సచివాలయంలో తాత్కాలికంగా కుర్చీలు, కార్పెట్ల ఏర్పాటు ఏమిటో అంతుబట్టడంలేదు. మంత్రులు, అధికారుల బంగ్లాలకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది.
ఈ పనులను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి ప్రతి ఏటా వారికి కోట్లాది రూపాయలు చెల్లిస్తారు. సాధారణంగా ఏదైనా మేజర్ రిపేర్లు ఉంటే ఆ పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించి నిధులు మంజూరుచేస్తారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైనప్పటినుంచి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. ప్రజాధనానికి రెక్కలొచ్చాయి. కనీసం ఆడిట్ కూడా లేదు. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని రూమ్ నంబర్-29లో విలేకరుల సమావేశాల నిర్వహణకుగాను గత ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్య తాత్కాలిక సీటింగ్, కార్పెటింగ్ ఏర్పాట్లకు రూ.7.65 లక్షలు విడుదల చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఉదాహరణకు 200 మంది హాజరయ్యే ఒక కార్యక్రమానికి టెంట్‌హౌస్ నుంచి కుర్చీలు, షామియానాలు, కార్పెట్లవంటివి తీసుకుంటే గరిష్ఠంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. అదే పక్షంరోజులపాటు కావాలనుకుంటే రూ.రెండు నుంచి మూడు లక్షలకన్నా ఎక్కువ ఖర్చుకాదు. అయినా ప్రభుత్వం మాత్రం రూ.7.65 లక్షలు విడుదలచేయడం గమనార్హం.
కుందన్‌బాగ్‌లోని మంత్రులు, ఐఏఎస్ అధికారుల రెండు క్వార్టర్లకు రంగులు వేసేందుకు రూ.46.50 లక్షలు, మూడు-నాలుగు క్వార్టర్లలో చిన్నాచితకా మరమ్మతు పనులకు రూ.1.20 కోట్లు విడుదలచేశారు. ప్రస్తుతం మార్కెట్లో విలాసవంతమైన నిర్మాణాల ఖర్చు ప్రతి చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉన్నది. ఇక్కడ మాత్రం పాత భవనాల మరమ్మతులకే కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం గమనార్హం. ఇప్పటికే బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రుల బంగ్లాల్లో ఒక్కో ఏసీకి రూ.లక్ష, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు రూ.5 లక్షలు, బాత్రూమ్ మరమ్మతుకు రూ.76 లక్షల చొప్పున విడుదలచేసిన సర్కార్.. తాజాగా గురువారం మరికొన్ని క్వార్టర్ల మరమ్మతులకు నిధులు విడుదలచేసింది. ఈ నిధుల విడుదల పరంపర గత కొన్నిరోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. రోజుకు ఒకటి-రెండు క్వార్టర్ల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు విడుదలచేస్తున్నారు. మంత్రుల క్వార్టర్లలో బాత్రూమ్ల మరమ్మతులకు చేస్తున్న ఖర్చుతో కొత్త క్వార్టర్లే నిర్మించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.