వేములవాడ, సెప్టెంబర్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు పరీవాహక ప్రాంతంలో బుధవారం అధికారులు సర్వే చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వేములవాడ పట్టణం మూలవాగుకు పరీవాహక ప్రాంతంగా ఉండగా, గత బీఆర్ఎస్ హయాంలో మొదటి బైపాస్ రహదారిలో బఫర్ జోన్ హద్దులను నిర్ణయించి అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో బైపాస్ రహదారి వద్ద అధికారులు బుధవారం సర్వే చేయడం కలకలం రేపింది.
సర్వేయర్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అధికారులు సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న మూలవాగు బఫర్ జోన్ హద్దుల ఏర్పాటుకు సర్వే చేశారు. ఇందులో భాగంగా దాదాపు 40 కట్టడాల వరకు గుర్తించినట్లుగా సమాచారం. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాలతో సర్వే నిర్వహించడంతో హైడ్రా తరహాలో కూల్చివేతలు ఉంటాయన్న పుకార్లు షికారు చేస్తుండగా, వేములవాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వేలో ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా ఇన్చార్జి ఏడీ సర్వేయర్ వినయ్, డీఐ బాలచంద్రం, ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, సంపత్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.