MLC Kodandaram | హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, నవంబర్ 3: హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ను ఎందుకు ప్రశ్నించడం లేదని పలు ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను నిలదీశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ‘పౌర సమాజంతో మాటా ముచ్చట’ కార్యక్రమం లో పాల్గొన్న ఆయనకు.. పలు ప్రజాసంఘాల నాయకులు ప్రజా సమస్యలపై ఏకరువు పెట్టారు. పదవీ విరమణ చేసి ఐదు నెలలైనా పింఛన్ అందలేదని ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుడు మార్క రవీందర్ వాపోయారు. ఆర్టీసీ కార్మికులకు కనీసం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. లోక్సత్తా నాయకుడు గూడూరు స్వామిరెడ్డి మాట్లాడుతూ.. రూ. రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాలేదని అన్నా రు. రైతులకు బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రిటైర్డ్ ఉద్యోగి ఎర్రం పాపిరెడ్డి మాట్లాడుతూ.. హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎందు కు అడగడం లేదని పలువురు కోదండరాంను ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విధంగా ప్రజా సమస్యలపై ఎందుకు పో రాటం చేయడం లేదని నిలదీశారు. సాంస్కృతిక కళాకారుడు బాబ్జి మాట్లాడుతూ.. ఐదు నెలలకోసారి జీతం వస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని పలువురు సూచించారు. హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని కోదండరాంను ప్రశ్నించారు. ఉద్యమం చేస్తేనే ప్రజా సమస్యలు పరిషారం అవుతాయని సూచించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటం ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నించారు. సమస్యలు పరిషరించని పక్షంలో ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడిగే హకు ఉన్నదని స్పష్టంచేశారు.