హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బుధవారం పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురసరించుకొని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 14 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఫైర్ సర్వీసులశాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి పాల్గొన్నారు.