Telangana | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పాలమూరు యూనివర్సిటీ (పీయూ) రిజిస్ట్రార్ నియామకంపై రచ్చ జరుగుతున్నది. ఓయూ వీసీ వర్సెస్ పీయూ వీసీ అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేశ్‌బాబును, తమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమించుకుంటూ పాలమూరు వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తనను రిలీవ్ చేయాలంటూ రమేశ్‌బాబు ఓయూ వీసీకి దరఖాస్తు సమర్పించారు. అయితే, తనకు తెలియకుండా, కనీసం సమాచారమివ్వకుండా తమ వర్సిటీ ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించడం పట్ల ఓయూ వీసీ కినుక వహించారు. ఆదివారం వరకు రమేశ్‌బాబును రిలీవ్ చేయలేదు. అయితే, మూడు నెలల క్రితమే ఓయూకు చెందిన ప్రొఫెసర్ చెన్నప్పను పాలమూరు వర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రొఫెసర్ చెన్నప్పకు ఐసీఎస్సార్ ప్రాజెక్ట్ రావడం వంటి కారణాలు చూపుతూ ఆయన స్థానంలో ప్రొఫెసర్ రమేశ్‌బాబును రిజిస్ట్రార్‌గా నియమించినట్టు చెప్తున్నారు. ఓయూ వీసీ మాత్రం రిలీవ్ చేసే విషయంపై మొండికేసినట్టు సమాచారం.
పెద్దల వద్దకు పంచాయితీ
ఇద్దరు వీసీల మధ్య పంచాయితీ విద్యాశాఖ పెద్దల వద్దకు చేరింది. కొత్త రిజిస్ట్రార్ నియామకంపై ఇద్దరు వీసీలు ఒకరిపై ఒకరు ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదుచేసుకున్నారు. తన వర్సిటీ ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించుకునేటప్పుడు కనీసం సమాచారమివ్వకపోతే ఎలా? మూడు నెలల క్రితమే ఒకరిని పంపించాం. మళ్లీ ఇంకొకరిని అంటే ఎలా? అనిఓయూ వీసీ కుమార్ ప్రశ్నించినట్టు సమాచారం. పాలమూరు వర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ సైతం ఉన్నత విద్యామండలి అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఉన్నత విద్యామండలి అధికారులు ఓయూ వీసీని సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయన ససేమిరా అనడం కొసమెరుపు.