పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. భార్య భర్తల మధ్య గొడవలతో సైకోగా మారిన ఓ యువకుడు తన సొంత స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద గల జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.
బసంత్ నగర్ ఎస్ఐ అర్కుటి మహేందర్ యాదవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బసంత్‌నగర్‌కు చెందిన అర్జున్ సామిల్ పాల్ ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంత కాలం సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇటీవలనే అనూష తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఏదో కోల్పోయిన బాధతో ఉంటున్న అర్జున్ సామిల్ పాల్ సైకోగా మారిపోయాడు.
మధ్య మధ్యలో ఫోన్లో అనూషతో మాట్లాడిన అర్జున్ మతిస్థిమితం సరిగా లేకుండా వ్యవహరిస్తూనే ఆదివారం తన సొంత స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టాడు. భారీ ఎత్తున మంటలు ఎగసి పడటంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ యాదవ్ తెలిపారు.