హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కొందరు ఉద్యోగుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా వాటిని రాష్ట్ర సర్కారు నేరుగా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. దీంతో నెలల తరబడి వేతనాలు అందక చిరుద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బందితోపాటు సామాజిక ఆడిట్ యూనిట్ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. వారి వేతనాలను చెల్లించేందుకు గతనెల 17న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.5.14 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.
ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లోగా సామాజిక ఆడిట్ యూనిట్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ గడువు దాటితే ఆలస్యమైన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం 12% వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటికి నెల రోజులు దాటినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు జమచేయకపోవడంతో సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ (శాట్) సిబ్బందికి వేతనాలు అందలేదు. రాష్ట్రంలో శాట్ సిబ్బంది దాదాపు 200మంది వరకు ఉంటారు. వారి వేతనాల కోసం రూ.50 లక్షలు అవసరం. ఇంత స్వల్ప మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతున్నది.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సీపీఆర్, ఆర్ఈ, సీఆర్డీలో మొత్తం 92,175 మంది చిరు ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ప్రతినెల ఒకటో తేదీన గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ఆ శాఖ మంత్రి సీతక్క గత మార్చి నుంచి చెప్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మల్టీపర్సస్ ఉద్యోగులు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఇటీవల ధర్నా చేశారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామ పంచాయతీల్లో పనిచేసే 52,473 మంది మల్టీపర్సస్ ఉద్యోగులకు తొలుత రెండు నెలలు, ఆ తర్వాత మరో నెల బకాయిలు చెల్లించింది.
మరో 40వేల మంది ఉద్యోగుల వేతనాలు పెండింగ్లో పెట్టింది. నేటికీ శాట్పాటు ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడునెలల (ఏప్రిల్ నుంచి జూన్) వేతనాలు అందలేదు. వాటి కోసం ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి వినతిపత్రాలు ఇవ్వడం నిత్యకృతంగా మారింది. కానీ, రేపు మాపు అంటూ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదే తప్ప పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు వాపోతున్నారు.