హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగళ్రావునగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23న వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. వెరిఫికేషన్‌కు హాజరు కాలేనివారు.. ఈ నెల 25న సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు స్పష్టంచేసింది.
నర్సింగ్ కాలేజీల నిర్వహణపై నివేదిక ఇవ్వండి ; సీఎస్‌కు జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీల నిర్వహణపై పూర్తి నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ఇటీవల సుమారు 30 నర్సింగ్ కాలేజీలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టు న్యాయవాది రేవంత్ ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అనేకమార్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), నర్సింగ్ రిజిస్టర్లను విచారణకు పిలిస్తే హాజరు కాలేదని, నివేదికలు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నర్సింగ్ కాలేజీల్లో సరైన వసతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడింది. ఈ అంశంపై అధికారులు విచారణకు హాజరు కాకపోవడంతో సీఎస్‌కు కమిషన్ నోటీసులు పంపింది. తక్షణమే కాలేజీలకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని హెచ్చరించింది.