Praja Palana | అటకెక్కిన హామీలు.. కానరాని అభివృద్ధి పనులు.. రాని ఇందిరమ్మ ఇండ్లు.. పెంచని పింఛన్లు.. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని రుణమాఫీ.. ఊరూరా యూరియా తిప్పలు.. అన్నింటితో ఇప్పటికే రగులుతున్న ప్రజలు గ్రామసభల్లో గర్జిస్తున్నరు. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలే వచ్చి తమ ముందు నిలబడటంతో దొరికిందే తడవుగా వారి దుమ్ము దులుపుతున్నరు. ప్రగతి, పథకాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నరు. హామీల మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నరు.
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నిరసనలు, నిలదీతలు, ఆగ్రహావేశాలు, ఖాళీ కుర్చీలు.. ఇవీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన గ్రామసభల్లో కనిపించిన దృశ్యాలు. ప్రభుత్వం గొప్పగా నిర్వహించ తలపెట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో తొలిరోజే నిరసనల సెగ తగిలింది. ఈ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ముఖ్యమైన ‘గ్రామసభ’లు ప్రజాగ్రహ వేదికలుగా మారాయి. హామీల అమలు, పథకాలు దక్కకపో వడంపై ఎక్కడికక్కడ ప్రజలు నిలదీశారు.
స్థానిక సమస్యలపై అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. రెండున్నేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంపైప్రశ్నించారు. ఈ సభలకు మెజారిటీ మం త్రులు ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సభలకు డుమ్మాకొట్టారు. ప్రజాప్రతినిధులెవరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

ప్రజాపాలన సభల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. ఎక్కడికక్కడ ప్రజలంతా కలిసి ప్రజా ప్రతినిధులను నిలదీశారు. పథకాలు ఏవి? యూరియా ఏది? రైతుభరోసా ఏది? అంటూ అన్ని సభ ల్లో ప్రశ్నల వర్షం కురిసింది. వాస్తవానికి 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా లు, అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి అమలు చేపట్టబోయే కొత్త పథకాలను సైతం ప్రజలకు వివరించాలని సూచించింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలంతా హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వం ఒకటి తలిస్తే ప్రజలు మరోలా అమలుచేశారు. ఈ సభలే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, పథకాలు ఎందుకు అమలు చేయడంలేదు? అంటూ పలుచోట్ల ఘెరావ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రూ.2,500 హామీ ఎందుకు అమలు చే యడం లేదు? పింఛన్లు రూ.4వేలకు ఎప్పుడు పెంచుతారు? అంటూ నిలదీశారు. యూరి యా దొరుకక గోస పడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు లేని యూరియా తిప్పలు ఇప్పుడే ఎందుకు వస్తున్నదంటూ నిలదీశారు. కొత్త పథకాల అమలు ఏమోగానీ ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన సభలకు ప్రజలే కాదు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ముఖం చాటేశారు. సభలకు హాజరయ్యే ప్రజలు, రైతులకు ఏం సమాధానం చెప్పాలో? తెలియక ఎక్కువ మంది ఆ వైపు కూడా చూడలేదు. ప్రజలు నిలదీస్తారనే భయంతో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరేకాలేదు. సమాచార పౌర సంబంధాల శాఖ వివరాల ప్రకారం.. కేవలం ఐదుగురు మంత్రులే ఆయా సభలకు హాజరయ్యారు. వారిలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మిగతా మంత్రులు సభల్లో పాల్గొన్నట్టు ఎక్కడా కనిపించలేదు. మంత్రులే రాలేదు.. మేమెందుకు వెళ్తామనుకున్నారో? ఏమో? గానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సభలకు డుమ్మాకొట్టారు. అక్కడక్కడా కొందరు పాల్గొన్నప్పటికీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా తెలిసింది. హాజరైన వారికి ముందుగా ఊహించినట్టుగానే ప్రజల నుంచి నిరసన సెగలు తగిలాయి. ఇలా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలే డుమ్మాకొట్టడం ప్రభుత్వంలో, పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని.. 99 రోజుల ప్రణాళిక మొదలుపెట్టిన రోజునే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి ముఖంమీదే చెప్పినట్టుగా తెలిసింది. తాము గ్రామసభలకు వెళ్లలేమని, ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించే పరిస్థితులే లేవని తేల్చిచెప్పినట్టు సమాచారం. ప్రభుత్వపరంగా మనం ఏదో చేశామని గొప్పగా చెప్తున్నప్పటికీ అవేవీ ప్రజలకు చేరడం లేదని, ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా రైతుభరోసా పంపిణీ, యూరియా కొరత, పంటల కొనుగోలు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పినట్టు తెలిసింది. సీఎంకు చెప్పినట్టుగానే ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామసభలకు దూరంగా ఉండటం గమనార్హం.
రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షుణ్నంగా అడిగి తెలుసుకొన్నారు.
ప్రజాపాలన సభలను ఎంతో ఘనంగా నిర్వహించాలని సర్కార్ భావించగా, అందుకు పూర్తి విరుద్ధంగా సభలు విఫలం అయ్యాయి. ఈ సభలకు ఆయాచోట్ల స్థానికులు సైతం హాజరుకాలేదు. అత్యధిక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సభలకు వచ్చేందుకు రైతులు నిరాకరించారు. సభలకు వచ్చిన ఆ కొద్దిమంది ప్రజలు, రైతులు.. ఇటు ప్రజాప్రతినిధులను, అటు అధికారులను వివిధ సమస్యలపై నిలదీయడం గమనార్హం. సభల్లో కుర్చీలు ఖాళీగా కనిపించకుండా చేసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. వృద్ధులను, కొన్నిచోట్ల విద్యార్థులను సైతం తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరుకావాల్సిన సభలకు అధికారులే పెద్దదిక్కయ్యారు. ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడంతో సర్పంచ్, వ్యవసాయ అధికారులు, జీపీవోలతో సమావేశాలు నిర్వహించి మమ అనిపించేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన గ్రామసభలు వెలవెలబోయాయి. పలుచోట్ల అధికారుల నిలదీతలు, ప్రశ్నల పరంపరతో కొనసాగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 23వ వార్డులో కౌన్సిలర్ తమను పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు సభను బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, దీనిపై ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో జాప్యంపై గృహ నిర్మాణ శాఖ ఏఈని ప్రజలు ప్రశ్నించారు.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారంలో సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీయడంతో రసాభాసగా మారింది. అనంతరం ఇసుక, బందెల దొడ్డి తదితర సమస్యలపై బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు భౌతికదాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మూసాపేట/అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 2: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం దాసరిపల్లిలో, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వార్డు సభల్లో నిర్వహించిన సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వ పథకాల అమలు ఎజెండా చదువుతుండగా.. పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడమే లేదని ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులతో అధికార పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని 15వ వార్డులో జరిగిన సభలో అధికారులను మ హిళలు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికిచ్చారు? ఎప్పుడిచ్చారు? నిరూపించాలని డిమాండ్ చేశారు. చాలా మందికి ఇచ్చినట్టే ఇచ్చి తొలగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజమైన అర్హులెవరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ప్రజాపాలన సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను వివిధ సమస్యలపై ప్రజలు నిగ్గదీసి అడిగారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందడంలేని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో నిర్వహించిన వార్డు సభలకు నిరసన సెగలు తాకాయి. 12వ డివిజన్ దేశాయిపేట వార్డు సభలో మంత్రి కొండా సురేఖ, 29వ డివిజన్ రామన్నపేటలో వార్డు సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని స్థానిక మహిళలు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బంగ్లాలో ఉన్న వారికే వరదసాయం ఇచ్చారని, సర్వం కోల్పోయిన కుటుంబాలకు అందలేదని ఎమ్మెల్యే నాయిని, మేయర్ గుండు సుధారాణిని స్థానికులు నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని దేశాయిపేట బొడ్రాయికి చెందిన మహిళలు మంత్రి సురేఖను నిలదీశారు. ఆయాచోట్ల మహిళలు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అక్కడి నుంచి మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని, మేయర్ సుధారాణి జారుకున్నారు.
మంచిర్యాల, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అధికార పార్టీ కార్యక్రమాలను తలపించాయి. అధికారిక కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫొటోలు పెట్టిన అధికారులు.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలైన మల్క కొమురయ్య, అంజిరెడ్డి ఫొటోలను పెట్టనేలేదు. చాలా గ్రామాల్లో ఫ్లెక్సీలు కాంగ్రెస్ నాయకుల ఫొటోలకే పరిమితయ్యాయి. జైపూర్‌లో ఎమ్మెల్సీ ఫొటో పెట్టకపోవడంపై అక్కడి ఎంపీడీవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామసభలో ఎమ్మెల్సీల ఫొటోలతోపాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ఫొటోనూ మరచారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. సభలో ఆయన మాట్లాడుతుండగా తమకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకివ్వలేదు? మేం ఓటు వేయలేదా? అని కలకోట యాదమ్మ నిలదీసింది. బంజరు కాలువలో చెట్లు తొలగించి, సీసీ లైనింగ్, పర్రెకాలువ పనులు చేయించాకే పాంనూర్‌లో అడుగు పెడుతానని గతంలో హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చేపట్టలేదని రైతు జాలిగపు రాజు, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి ఒగ్గు రాజు కడియంను ప్రశ్నించారు. జనగామ మండలం చౌడారంలో గ్రామసభ వేదికపై డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి కూర్చోవడంపై పలువురు నిరసన వ్యక్తంచేశారు.
నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 2: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన సభలు నిలదీతలు, నిరసనల మధ్య సా గాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో తమ భూమిలో నుంచి అస్తవ్యస్తంగా వేసి న విద్యుత్తు స్తంభాలను తొలగించాలని మహిళా రైతు ముష్కరి గంగమణి విద్యుత్తుశాఖ ఏఈ వినీత్‌రెడ్డి కాళ్లపై పడి వేడుకొన్నది. కరీంనగర్‌లోని నాలుగో డివిజన్ పరిధిలోని దుర్శేడ్‌లో సభను ఆ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకొన్నారు. స్థానికులకు కనీస సమాచారం అందించకుం డా, 20 కుర్చీలే వేసి నిర్వహించడం సరికాదని ఆందోళన వ్యక్తంచేశారు.
బీజేపీ కార్పొరేటర్ రవీందర్‌కు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగి సభ రద్దయింది. కరీంనగర్‌లోని 6వ డివిజన్లోని బొమ్మకల్ పరిధిలో అధికారులకు చేదు అనుభవం ఏదురైంది. డివిజన్ కార్యాలయ భవనం నిర్మించిన తనకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ ఉదయం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల హామీ మేరకు కాంట్రాక్టర్ తాళం తీయడంతో గంట ఆలస్యంగా సభ నిర్వహించారు. జగిత్యాల మున్సిపాలిటీలోని 25 వ వార్డులో కౌన్సిలర్ సామల్ల జమునారాజశేఖర్ స్కూల్లో వార్డు సభ ఉన్నదంటూ స్థానికులకు తెలిపారు. తీరా మున్సిపల్ అధికారులు వచ్చి ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేయడంతో దానికి తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు.
సిద్దిపేట/కొండపాక/హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 2: ఉమ్మడి మెదక్ జిల్లా లో అధికారులకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. ఆరుగ్యారెంటీలు, హామీల అమలు ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. సిద్దిపేట పట్టణంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని నిరసన వ్యక్తమైంది. సభల కోసం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల ఫొటోలు లేకపోవడంతో పలు వార్డు సభలను బహిషరించారు. పలుచోట్ల సభలకు జనమే రాలే దు.
కొన్ని వార్డుల్లో కుర్చీలు తప్ప ప్రజలు లేకపోవడంతో మహిళా సంఘాల సభ్యు లు, క్షేత్రస్థాయి సిబ్బందితో అధికారులు ప్రభుత్వ సందేశాన్ని, రాష్ట్ర గీతాన్ని వినిపించి తూతూమంత్రంగా ముగించారు. ఆరుగ్యారెంటీలపై హుస్నాబాద్ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎదురైన ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి గురువారం కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని పలు గ్రామసభలకు హాజరయ్యారు. గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి సబ్సిడీ రావడం లేదని మహిళలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జప్తినాచారం గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇచ్చిన ఇండ్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని నిలదీశారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా నిలదీతలు, నిరసనలతో గ్రామసభలు గందరగోళంగా మారాయి. కాంగ్రెస్ హామీలపైనే ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. హామీల ఎగవేత, అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీశారు. రుణమాఫీ కాలేదని, రేషన్‌కార్డు ఇవ్వడం లేదని బాధితులు గొంతెత్తారు. ఆసరా పింఛన్ సొమ్ము పెంపు, తులం బంగారం వంటి పథకాలతోపాటు అభివృద్ధి పనుల్లో జాప్యంపై నిలదీశారు. అర్హులకు పథకాలు అందించలేనప్పుడు గ్రామసభలు ఎందుకని ప్రశ్నించారు.
ఏర్గట్ల మండలం తొర్తి గ్రామసభలో స్థానికులు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను ప్రదర్శిస్తూ ‘ఇది ఝూటా ప్రభుత్వం’ అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన పనుల పోస్టర్లను చూపిస్తూ ‘అభివృద్ధి అంటే ఇది’ అని తేల్చిచెప్పారు. యూరియా యాప్‌ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కోటగిరి, మోర్తాడ్, కమ్మర్పల్లి, నవీపేట, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన 3, 20, 21వ వార్డుల సభల్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది నాయకులు సైతం అధికారులు, ప్రజాప్రతినిధు లతో పాటు సమానంగా కూర్చున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 5,6,7,25,26 వార్డుల సభలు నిర్వహించగా 25వ వార్డు కౌన్సిలర్ మేఘన భర్త పొనగంటి శ్రీనివాస్ దర్జాగా కూర్చున్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ప్రశ్నిస్తుంటే శ్రీనివాస్ జోక్యం చేసుకోవడంపై స్థానికు లు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పా రంలో ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వివరిస్తుండగా.. రుణమాఫీ ఎక్కడైందని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, రైతుబంధు జమ చేయడంలేదంటూ రైతులు నిలదీశారు.