పాల్వంచ/మణుగూరు టౌన్, జూన్ 27 : నల్లగొండ వైటీపీఎస్‌లోని రెండు ప్రధాన ప్లాంట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్‌లో ఉద్యోగులు శనివారం భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. కేటీపీఎస్‌లోకి వెళ్లే ప్రధాన గేట్ల ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు.
బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట బ్యానర్లు, ప్లకార్డులతో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జాక్ నాయకులు మాట్లాడుతూ.. వైటీపీఎస్‌లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లను మూడేండ్ల కాలానికి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం, టీజీ జెన్కో యాజమాన్యం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆయా విభాగాల్లోని పనులను జెన్కో ఇంజినీర్లు, ఉద్యోగులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.