గన్నేరువరం, ఆగస్టు 29: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ప్రాంతాన్ని ఒక గ్రామంగా, లోపలి వైపు ఉన్న ప్రాంతాన్ని మరో గ్రా మంగా విభజిస్తున్నారన్న సమాచారం మేరకు వారు ఆయన్ను నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అకడి నుంచి తిరిగి వెళ్తుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కలుగజేసుకొని గ్రామస్థులకు సర్ది చెప్పించారు. ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గ్రామా న్ని విభజించకుండా తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.