మిర్యాలగూడ, మే 2: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ‘కేసీఆర్ కళాభారతి’ నుంచి కేసీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.10కోట్లతో ప్రతిష్టాత్మకంగా మినీ రవీంద్రభారతిని నిర్మించి దానికి ‘కేసీఆర్ కళాభారతి’ అని పేరుపెట్టారు. మున్సిపల్ అధికారులు గురువారం కేసీఆర్ కళాభారతిలో నుంచి కేసీఆర్ పేరును తొలగించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీస్తే .. స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో కేసీఆర్ పేరును తొలగించినట్టు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కళాభారతి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్‌కు కేసీఆర్ పేరును వెంటనే చేర్చాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పోటీపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఆనవాళ్లు తొలగించడం ప్రజాస్వామ్యంలో మంచి సంస్కృతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖాళీ చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కళాభారతి రాష్ట్రంలో వరంగల్ తర్వాత అత్యంత సుందరంగా నిర్మించిన కళావేదిక అని చెప్పారు. కేసీఆర్ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి ఆయన దూరం కారని, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిదికాదని హితవుపలికారు. గత ప్రజాప్రతినిధులు వారి నాయకుల పేర్లు అభివృద్ధి పనులకు పెట్టుకున్నారని, తన హయాంలో వాటిపై ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, దుర్గంపూడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.