అలంపూర్ చౌరస్తా, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం ఏదో చోట రైతుల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. కందులు కేవలం మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మార్కెట్లో కందుల ధర పడిపోవడంతో మద్దతు ధరకు కొనుగోలు చేసేలా కేంద్రం అనుమతినిచ్చిందన్నారు.
అయితే ఎకరానికి మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్లు ఉన్నదని, టీడీఆర్ 59 రకంతో అలంపూర్ రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు పండించారని తెలిపారు. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఎకరానికి 3 వరకే కొనుగోలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. మిగితా పంట ఎక్కడ అమ్ముకోవాలని నిలదీశారు. కలెక్టర్ స్పందించి కొనుగోలు పరిమితిని ఎకరానికి 3 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల వరకు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వేరుశనగ, మిర్చి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆందోళన చేపట్టినా అధికారులు స్పందించకపోవడంతో చివరకు విరమించారు.