ముదిగొండ, సెప్టెంబర్ 8 : పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఒకనాడు ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి ఇప్పుడు అధ్వానంగా మారింది. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టడం లేదని, కాల్వల్లోని మురుగు తొలగించడం లేదని ఆరోపిస్తూ గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో సోమవారం చెత్త వేసి నిరసన తెలిపారు. వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయని, రోడ్ల వెంట పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయని, కాల్వల్లో మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, చేసేది లేక చెత్తను పంచాయతీ కార్యాలయంలో పోసినట్టు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.