హైదరాబాద్/హనుమకొండ/ఖలీల్‌వాడి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ బుధవారం రెండో రోజూ కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. రూ.2,500 కోట్లు బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యాజమాన్యాలు మంగళవారం నుంచి కాలేజీల బంద్ పాటిస్తున్నాయి. కళాశాలలను నిరవధికంగా బంద్ చేసి హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట శాంతి దీక్ష చేపట్టారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుమారు 70 కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఏకశిలా పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే, నిజామాబాద్‌లోని ధర్నాచౌక్‌లో వివిధ కళాశాలల యజమానులు, ఉద్యోగులు, బోధన, బోధనేతర సిబ్బంది బుధవారం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీడీఎంఏ నాయకులు శ్రీధర్‌రావు, రవీంద్రనాథ్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్‌కు తెలంగాణ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్య సంఘం (టీఈపీసీఎంఏ) చైర్మన్ డాక్టర్ ఎన్ గౌతమ్‌రావు, కార్యదర్శి డాక్టర్ కే సునీల్‌కుమార్ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రొఫెషనల్ కళాశాలలు కూడా ఇలాగే ఆర్థిక సంక్షోభాన్ని ఎదురొంటున్న దృష్ట్యా బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తుంగతుర్తి, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అద్దె బకాయి కోసం గురుకుల పాఠశాలకు తాళం వేసిన బిల్డింగ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నెలల తరబడి అద్దె చెల్లించకపోడంతో భవనం యజమానికి బత్తుల లాలయ్య మంగళవారం పాఠశాల గేటుకు తాళం వేశారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఉమారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాలయ్య బుధవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.