హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కల్లుగీత కార్మికులకు ఈ నెల 25లోగా ‘కాటమయ్య రక్షణ కవచం కిట్లు’ పంపిణీ చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడతగా 15 వేల మంది గీత కార్మికులకు శిక్షణ ఇవ్వడంతోపాటు కిట్లను పంపిణీ చేయగా, తాజాగా రెండో విడతలో మరో 10 వేల మందికి కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా బీసీ డెవలప్మెంట్, ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో అర్హుల గుర్తింపుతోపాటు శిక్షణ ఇచ్చి కిట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.