Irrigation | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరందడం కష్టమేనని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా అంచనాలు రూపొందించారని ఫీల్డ్ ఇంజినీర్లు వివరిస్తున్నారు. అంచనాల మేరకు సాగునీటి నిల్వలు అందుబాటులో లేవని, చివరి ఆయకట్టుకు నీరు అందించడం గగనమేనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో తేమ, ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న క్రమంలో నీటి అవసరం అంతగా లేదని.. కానీ, మున్ముందు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా నిల్వలు లేవని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. వెరసి యాసంగి సాగులో నీటితిప్పలు తప్పకపోవచ్చని ముందస్తుగానే ఆయకట్టు రైతులను హెచ్చరిస్తున్నారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, మిడ్‌మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటివారం నాటికి తాగునీటి అవసరాలు పోగా, 354.88 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) లెక్క తేల్చింది.
ఈ యాసంగి సీజన్లో మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించింది. మేజర్ ప్రాజెక్టుల్లో 277.59 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, వాటి కింద 30.96 లక్షల ఎకరాలకు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 30.38 టీఎంసీల నిల్వ ఉండగా 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో అందుబాటులో ఉన్న 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలు రూపొందించారు. వెట్క్రాప్స్కు 24.54 లక్షల ఎకరాలు, ఐడీ క్రాప్స్‌కు 17.94 లక్షల ఎకరాలు మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కమిటీ తైబందీ ఖరారు చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్‌లో అంటే వారం విడిచి వారం మొత్తంగా సగటున మొత్తంగా 6 తడులను అందించాలని కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే పలు ప్రాజెక్టుల అధికారులు కాలువల ద్వారా సాగునీటి విడుదలను కూడా ప్రారంభించారు. అయితే నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం కష్టమేనని ప్రస్తుతం క్షేత్రస్థాయి ఇంజినీర్లు వివరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులకు విరుద్ధంగా..
రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వరి, ఆరుతడి పంటలకు తైబందీ ఖరారు చేశారని కానీ, క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం అంచనాలకు మించి వరి ఎక్కువగా సాగు చేశారని, ఆరుతడి పంటలను తక్కువ మొత్తంలో సాగు చేశారని తెలుపుతున్నారు. ప్రస్తుతం వరితోపాటు, ఇతర పంటల సాగు ఇప్పుడే ప్రారంభమైందని, ఈ దశలో కావాల్సిన నీటి పరిమాణం తక్కువగానే ఉంటుందని వివరిస్తున్నారు. అదీగాక ప్రస్తుతం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాలువ నీటిపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితులు లేవని చెబుతున్నారు. అయితే మున్ముందు తేమ శాతం తగ్గడంతోపాటు, పంటలు ఎదిగే దశలో నీటి పరిమాణం ఎక్కువ అవసరమని వివరిస్తున్నారు. ఆ దశ వచ్చేనాటికి ప్రస్తుతమున్న నీటినిల్వలు సరిపోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదీగాక వివిధ ప్రాజెక్టుల ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువలు పూడిక పేరుకుపోయి, కంపచెట్లు విపరీతంగా పెరిగి నీటి సరఫరాకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఆయా కాలువల్లో డిజైన్ సామర్థ్యం మేరకు సాగునీరు ప్రవహించని దుస్థితి నెలకొన్నదని క్షేత్రస్థాయి ఇంజినీర్లు వాపోతున్నారు. నీటి రవాణా నష్టాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయని వివరిస్తున్నారు. కొన్నిచోట్ల పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసినా కాలువల చివరి ఆయకట్టుకు ఇప్పుడే నీరందని దుస్థితి నెలకొన్నదని నొక్కిచెబుతున్నారు. మరోవైపు కాలువల పొడవునా రైతులు మోటర్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నీటిని వినియోగిస్తున్నారని, వెరసి దిగువకు నిర్దేశించిన మొత్తం కంటే తక్కువగానే నీరు వెళ్తున్నదని తెలుపుతున్నారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా అంచనాల మేరకు సాగునీటి నిల్వలు లేవని ఫీల్డ్ ఇంజినీర్లు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో యాసంగిలో సాగునీరు పూర్తిస్థాయిలో అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పలు చోట్ల చేతులెత్తేసిన వైనం..
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురిశాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. అయినప్పటికీ ప్రస్తుతం యాసంగి సీజన్లో పలు ప్రాజెక్టుల కింద సాగునీరివ్వలేమని అధికారులు చేతులెత్తేసిన దుస్థితి నెలకొన్నది. ఇతర ప్రాజెక్టుల కింద కూడా అత్తెసరు నీటితోనే సరిపెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ, వేసవి తాగునీటి అవసరాలు పోగా నికరంగా 60 టీంఎసీలకు మించి వాడుకోలేని పరిస్థితి. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ ఆయకట్టుకే ఆ నీరు సరిపోని దుస్థితి. ఇక ఎస్సారెస్పీపై ఆధారపడిన లిఫ్ట్‌లకు అదనంగా నీరు అవసరముంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నుంచి దిగువకు 5 టీఎంసీలను ఎల్ఎండీకి విడుదల చేసి సాగునీరందించాలని నిర్ణయించారని ఇంజినీర్లు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎల్ఎండీలో 20.78 టీఎంసీలు, శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ (ఎంఎంఆర్)లో 22.34 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో మిషన్ భగీరథ, తాగునీటి అవసరాలకు పోగా నికరంగా 2 ప్రాజెక్టుల నుంచి 25 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండని పరిస్థితి.
ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీలు వచ్చినా మొత్తం 30 టీఎంసీలే. అయితే కాకతీయ కెనాల్ ఎల్ఎండీ 146-284 కి.మీ. వరకు 5,05,720 ఎకరాలు, అదే విధంగా 284 కిలోమీటర్ నుంచి 347 కిలోమీటరు వరకు ఎస్సారెస్పీ స్టేజ్- 2 కింద 3,71,691 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఆయకట్టు మొత్తానికి సాగునీరందించేందుకు 60 టీఎంసీలు అవసరం. కానీ, అధికారులు 30 టీఎంసీలతోనే, అదీ ఆరు తడులతోనే సరిపెడతామని ఇప్పటికే వెల్లడించారు. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల సాగునీరివ్వలేమని ముందే చేతులెత్తేసిన పరిస్థితి ఉన్నది. జలాలు సమృద్ధిగా అందుబాటులో లేని కారణంగా మిడ్‌మానేరు ఎగువకు నీరివ్వలేమని అధికారులు ఇప్పటికే తేల్చిచెప్పారు. వాస్తవంగా కాళేశ్వరం ప్యాకేజీ 10, 11, 12, జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట్, తుర్కపల్లి, ఉప్పరపల్లి కెనాళ్ల కింద మొత్తంగా దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతీ యాసంగి సీజన్లోనూ రాజరాజేశ్వర జలాశయం నుంచి అనంతగిరి, అక్కడి నుంచి రంగనాయక సాగర్‌కు జలాలను తరలించి సాగునీటిని అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది సాగునీటిని అందించలేమని అధికారులు చేతులేత్తారు.
కృష్ణా బేసిన్లో మరీ దారుణం…
ఇక కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కృష్ణమ్మ పొంగిపొర్లినా యాసంగి సాగుకు నీరులేని దుస్థితి నెలకొన్నది. జూరాల, భీమా ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో నీరివ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రస్తుతం 3 పంపులే నడుస్తుండగా, ప్రాజెక్టు కింద దాదాపు 2.50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నది. శ్రీశైలంలో జలాలు ఉన్నా పూర్తిస్థాయిలో ఎత్తిపోయలేని దుస్థితి. మొత్తంగా యాసంగి పంట చేతికొచ్చేవరకు సాగునీరందే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నారుమడిలో.. రైతు గుండెతడిలో కేసీఆర్
సూర్యాపేట జిల్లా నాగారం మడలం నాగారం బంగ్లా గ్రామానికి చెందిన యువరైతు బెల్లి నరకేశ్ తన పొలంలోని నారుమడిలో కేసీఆర్ అంటూ నారు వేసి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల పాటు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. తాను పండించే పంటలోనూ కేసీఆర్‌ను చూసుకుంటున్నానని తెలిపారు. – నాగారం