హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు/వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం నిర్వహిస్తున్న ఈవెనింగ్ బీటెక్ కోర్సు వ్యవధిని పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సులను నాలుగేండ్లకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సులు పూర్తిచేసి, ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారు బీటెక్ సెకండియర్లో అడ్మిషన్ పొందేందుకు బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వర్కిం గ్ డేస్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారాంతాల్లో రోజంతా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలోని 11 కాలేజీల్లో 500 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఇందుకు జేఎన్టీయూ, ఓయూ అంగీకరించినట్టు ఓ సీనియర్ ప్రొఫెస ర్ వెల్లడించారు.
త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని సద రు అధికారి తెలిపారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీ, అబ్దుల్ కలాం, అనుబోస్, జయప్రకాశ్ నారాయణ, ఎంజీఐటీ, సిద్ధార్థ, సెయింట్ పీటర్స్, వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, ఎంవీఎస్సార్, మెథడిస్ట్, స్టాన్లీ కాలేజీల్లో ఈవెనింగ్ బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీకి రాష్ట్రస్థాయిలో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇలా కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ ఎగ్జామ్ ఈసెట్ తరహాలో ఉంటుంది. 100 ప్రశ్నలకు నిర్వహించే ఎగ్జామ్లో 90% ప్రశ్నలు ఆయా సబ్జెక్టుల నుంచి, 10% గణితం నుంచి ఉంటాయి. వారంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.
ఈవెనింగ్ కోర్సుల్లో చేరినవారంతా ఉద్యోగులే కావడంతో అటు ఉద్యోగం.. ఇటు కోర్సులు పూర్తిచేయడం కష్టంగా మారింది. దీంతో వ్యవధి పెంపు విషయంలో కదలిక వచ్చింది. సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, మెటలర్జీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి సెమిస్టర్లో నాలుగు సబ్జెక్టులు పూర్తి చేయాల్సి ఉండగా, ప్రోగ్రామ్ వ్యవధి పొడిగింపు తర్వా త ప్రతి సెమిస్టర్కూ సబ్జెక్టుల సంఖ్యను మూడింటికి తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నారు. కోర్సుల వ్యవధిని పెంచినా ఫీజుల పెంపు ఉండదని అధికారులు అంటున్నారు.