Telangana | హైదరాబాద్, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యనేత కనుసన్నల్లో విస్తరించిన షాడో సీఎంవోతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆదేశాలు పాటిస్తే అందలం ఎక్కిస్తున్నారని, వినకపోతే వెంటనే బదిలీ చేస్తున్నారని, ఇక ముక్కుసూటిగా పనిచేస్తే చేతకానివాడిగానో, అవినీతిపరుడనో ముద్రలు వేసి లూప్లైన్కు పంపిస్తున్నారని భయాందోళన చెందుతున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వారిచ్చే మౌఖిక ఆదేశాలను వెనుకాముందూ ఆలోచించకుండా అమలు చేస్తే భవిష్యత్తులో ఊచలు లెక్కించక తప్పదని అధికారులు తమ సన్నిహితులతో చెప్పుకొని భయపడుతున్నట్టు సమాచారం.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు చెప్పిన పనులకు తలూపి కెరీర్‌ను నాశనం చేసుకొని, జైలుపాలైన వారి జీవితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని వారు వాపోతున్నారట. ఇటీవల వారి మాటను ధిక్కరించిన పోలీసు ఉన్నతాధికారిని హక్కుల నోటీసుల పేరుతో బెదిరించారని, ఏకంగా ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పంపించి క్షమాపణలు చెప్పించారని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. మరోవైపు షాడో సీఎంవో ప్రతినిధులతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న కొందరు సీనియర్ బ్యూరోక్రాట్లు మాత్రం వచ్చిన ఆదేశాలను తక్షణం అమలు చేస్తున్నారని, ఫొన్‌కాల్ అందడమే ఆలస్యం చట్టవిరుద్ధమైన పనిని కూడా చట్టబద్ధమైన రికార్డులగా మార్చి స్వామిభక్తి చాటుకుంటున్నారని చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో వాళ్లు రూ.వందల కోట్లు వెనుకేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవినీతిలో ఆరితేరిన ఆ బ్యూరోక్రాట్లు భవిష్యత్తులో తమ మీదికి రాకుండా దిగువ శ్రేణి అధికారులను రికార్డు పరంగా ఫిక్స్ చేస్తున్నారని కుతకుతలాడిపోతున్నారు.
షాడో కత్తి వేటుకే రిజ్వీ బలి?
ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ మధ్య సాగిన వివాదంతో బ్యూరోక్రాట్ల పనితీరు మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత జూపల్లి మీడియాతో మాట్లాడారు. రిజ్వీకి ప్రైవేటు సెక్టార్లో జీతం ఎక్కువ వస్తుంది కాబట్టే వీఆర్ఎస్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇదే నిజమైతే.. కీలకమైన ఆదాయాన్నిచ్చే శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న రిజ్వీ.. ఒక్క అక్రమ ఫైల్ మీద చూసి చూడనట్టు సంతకం చేస్తే రూ.కోట్లు ఇంటికే వస్తాయని సచివాలయ అధికారులు చెప్తున్నారు. కానీ ఆయన జీతం కోసం అత్యుత్తమైన పదవిని ఒదులుకోవటానికి సిద్ధపడ్డారంటేనే నిజాయితీ అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
విధుల పట్ల నిక్కచ్చిగా ఉండే రిజ్వీ తనకు తెలియకుండానే షాడో సీఎంవోకు లొంగిపోయారనే ప్రచారం జరుగుతున్నది. హోలోగ్రామ్ టెండర్స్, నిపుణుల కమిటీ ఫైళ్లను ఎక్సైజ్ శాఖ మంత్రిని కాదని నేరుగా సీఎంకు పంపినట్టుగా ప్రచారం జరుగుతున్నది, ఇది సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని, అంతర్గతంగా ఏది ఉన్నా రూల్స్‌ను అతిక్రమించినట్టేనని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎక్సైజ్‌శాఖను బిగ్బ్రదర్స్లో ఒకరు చూస్తున్నారని, వారి ఒత్తిడి మేరకు రిజ్వీ శాఖాపరమైన లావాదేవీలు మంత్రి ప్రమే యం లేకుండా చేశారని సమాచారం.
ఒక దశలో తన శాఖలో ఏం జరుగుతున్నదో తనకే తెలియక పోవటంతో, మంత్రి తన సన్నిహితులతో సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు పెట్టించి రికార్డులు తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. హోలోగ్రామ్ టెండర్లను దక్కించుకోవటానికి ముఖ్యనేత సన్నిహిత బిగ్ బ్రదర్స్ ఒక వైపు, మంత్రి సన్నిహిత వర్గం మరో వైపుగా ఉండి రిజ్వీ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టుగా సమాచారం. డిస్టిలరీలకు (మద్యం తయారు చేసే కంపెనీలు) అనుమంతిచిన దానికి కంటే ఎక్కువ మద్యం తయారీ అనుమతుల విషయంలో కూడ ఈ రెండు వర్గాలు దూరిపోయాయని, ప్రపోజల్ కంపెనీకి ఇవ్వాలని ఒక వర్గం, ఇవ్వొద్దని మరో వర్గం ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ఒత్తిళ్లలో ముఖ్యనేత సన్నిహిత వర్గం వైపే ఆయన మొగ్గు చూపినట్టు సమాచారం. ఇదంతా ఎక్సైజ్ మంత్రి సమాచార హక్కు చట్టం ద్వారా తెప్పించుకున్నట్టు, వాటిని చూపి ఆయనను ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కొండా సురేఖ ఓఎస్డీ కేసులో సీఐపై గురి?
దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం అంతా ఇద్దరు షాడోల పర్యవేక్షణలో జరిగిందని సమాచారం. రోహిన్‌రెడ్డి కార్యాలయంలో పారిశ్రామిక వేత్త తల మీద కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ గన్ పెట్టి బెదిరించాడనే విషయం తెలియగానే షాడో సీఎంవో నుంచి షాడో హోంమంత్రి బయటికి వచ్చినట్టు తెలుస్తున్నది. స్వయంగా ముఖ్యనేతే ఆయనకు హోం బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతున్నది.
పోలీసుల బదిలీలు, పోస్టింగులు అన్నీ కూడా షాడో మంత్రి చేతుల్లో ఉన్నాయని ప్రచారం. సుమంత్ మీద ఎఫ్ఐఆర్ అయిందో లేదో? తెలుసుకోకుండానే షాడో హోం మంత్రి అతడిని అరెస్టు చేయాలని డీజీపీ మీద ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సుమంత్‌ను వెతికి పట్టుకోవటం కోసం తానే డీజీపీగా మారి అప్పటికప్పుడు 20 పోలీసు టీంలను ఏర్పాటు చేయించినట్టు తెలిసింది. ఎలాంటి నోటీసులు, సెర్చ్ వారెంటు లేకుండానే సీఐ ర్యాంకు అధికారిని అర్ధరాత్రి వేళ ఏకంగా మంత్రి ఇంటి మీదికి పంపించే దుస్సాహాసం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
జరుగుతున్న తతంగాన్ని ఆపలేక, షాడో మంత్రికి నో చెప్పలేక డీజీపీ తీవ్ర ఇబ్బంది పడ్డట్టు సమాచారం. నాటి రాత్రి ఆయన చేసిన పనికి ఈ రోజున డీజీపీ కచ్చితంగా సుమంత్‌ను అరెస్టు చేయటమా? లేకుంటే ఎటువంటి నోటీసులు, వారెంట్లు లేకుండా మంత్రి ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసు సీఐని సస్పెండ్ చేయటమా? ఏదో ఒకటి చేయకపోతే ప్రజలు తనను నమ్మరని, ఒక వేళ మంత్రి ఇంటికి వెళ్లిన సీఐని సస్పెండ్ చేస్తే సహచర పోలీసువర్గాల నుంచి ఎటువంటి విమర్శలు ఎదురైతాయోనని డీజీపీ ఆందోళనతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు, లూప్లైన్లకు బదిలీలు పోలీస్‌శాఖలో మాట విననివారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని మెట్టుగూడలోని 733 సర్వే నంబర్లో 5717 గజాల వివాదాస్పద భూమిలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య వివాదం ఏర్పడిందట. దీంతో ఆ ఉన్నతాధికారి మీద సభాహక్కుల నోటీసులు ఇస్తామని బెదిరించి, ఆయన్ను ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పంపి క్షమాపణ చెప్పించారని సమాచారం.
వివాదస్పద భూమిలోకి ఒక వర్గం నుంచి ఓ ఎమ్మెల్యే, మరో వర్గం నుంచి పోలీసులు తలదూర్చినట్టు తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా అవసరాలరీత్యా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారని, అది విధి నిర్వాహణలో భాగమని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమకు ఆ డ్యూటీ తప్పదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో తమ వాళ్ల మీద కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారంటూ పోలీసు అధికారులు కుతకుతలాడుతున్నట్టు తెలిసింది. గత 22 నెలల్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా ముగ్గురిని మార్చారు. ఎందుకు చేస్తున్నారో ఎవరీకి అంతుపట్టడం లేదని, కనీసం ఎందుకు బదిలీ అవుతున్నారో వారికి కూడా తెలియదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని సీపీగా నియమించారు. ఆ సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చారు. ఆయన్ను తొలిగించి ఇప్పుడు సజ్జనార్‌కు బాధ్యతలు అప్పగించారు.
మాట వింటే మూటలే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ బ్యూరోక్రాట్లు రెండు వర్గాలుగా మారారని సచివాలయ వర్గాలు తెలిపాయి. అవినీతికి అనుకూల వర్గం ఒకటికాగా, మరొకటి అవినీతికి తలవంచని వారుగా విడిపోయినట్టు తెలిసింది.
షాడో సీఎంవో కనుసైగలతో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్‌లు కోరుకున్న చోట పోస్టింగులతోపాటు రూ.500 కోట్ల క్లబ్బులో మెంబర్లుగా చెలామణి అవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. వారు హైదరాబాద్ మహానగరం చూట్టూ 50 కిలోమీటర్ల పరధిలో బినామీ ఆస్తులు కూడబెట్టి ఫాంహౌజ్‌లు కడుతున్నట్టు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
మరికొందరు సొంత రాష్ర్టాలకు డబ్బును వివిధ రూపాల్లో తరిగిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అక్రమ సంపాదనలో పొరుగు రాష్ర్టాల అధికారుల పెత్తనమే ఎక్కువగా ఉన్నదని బ్యూరోక్రాట్లు చెప్తున్నారు. వారిని ఉదాహరణగా చూపించి నిజాయితీపరులైన అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని, లొంగని వారిని మూడు నెలలకోసారి, ఆరు నెలల ఒకసారి బదిలీచేసి తిప్పుతున్నట్టు సమాచారం. రూల్‌బుక్ ప్రకారం వెళ్తానని పట్టుబట్టడంతో రిజ్వీని రెండేండ్ల కాలంలో మూడు శాఖలకు బదిలీచేసి, ఆఖరికి తనంతటతానే వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయేట్టు చేశా రని పలువురు బ్యూరోక్రాట్లు ఆరోపిస్తున్నారు. గంపగుత్తగా పదోన్నతుల కాంట్రాక్టు..
ఇటీవల రెవెన్యూ శాఖలో కొంత మంది అధికారులకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయి తే ఈ పదోన్నత వ్యవహారం షాడో సీఎంవో కు అత్యంత సమీపంగా తిరిగే అధికారిగా గుర్తింపు ఉన్న సీనియర్ అధికారికి గంపగుత్త బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక రకంగా ఆయనకు కాంట్రాక్టు ఇచ్చినట్టు ఉందని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియార్టీ, సిన్సియార్టీని ప్ర మాణికంగా తీసుకుకోండా, మూటల బరు వు ఆధారంగా సదరు అధికారి పదోన్నతులు కల్పించారని వారు ఆరోపిస్తున్నాయి. ఏసీబీ కేసుల తీవ్రత, ఇతర ఆరోపణల తీవ్రతను ప్రమాణికంగా తీసుకొని ప్రతి పదోన్నతికి ఒక రేట్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మొత్తం 15 మం దికి పదోన్నతి కల్పిస్తే అందులో సగం మంది ఏసీబీ కేసులు ఉన్న వారే ఉన్నట్టు రెవెన్యూ గెజిటెడ్ అధికారులు ఆరోపిస్తున్నారు. పదోన్నతులలోనే కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా అధికారులు చెప్తున్నారు.