హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టెంట్ సిటీ తరహా టూరి జం అభివృద్ధిని ప్రోత్సహించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాశీలోని విశ్వనాథస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా గంగానది ఒడ్డున ఏర్పాటుచేసిన టెంట్ సిటీని సందర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత గురించి ఇతర దేశాల్లో ప్రచారం నిర్వహించడం వల్ల సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగా టెంట్ సిటీ తరహా టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రాంతాలైన మహబూబ్‌నగర్‌లోని ఎకో టూరిజం పార్క్, కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్క్, సోమశిల, అనంతగిరి హిల్స్, మల్లన్నసాగర్, లక్నవరం తదితర ఎకో టూరిజం, ఫారెస్ట్ సఫారీ, అడ్వెంచర్ టూరిజం తదితర ప్రాంతాలను గుర్తించామని వెల్లడించారు. మంత్రి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఎండీ మనోహర్ తదితరులు ఉన్నారు.