TG Budget హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నిత్యం అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం రేవంత్.. తాజా వార్షిక బడ్జెట్లో కూడా అబద్ధాలు, అసత్యాలతో నే నింపారని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావు ఆరోపించారు. ప్ర భుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని, ఆ విషయం జనవరి ముగిసే నాటికే అర్థమైనప్పటికీ.. బడ్జెట్ పరిమాణాన్ని పెంచారని విమర్శించారు. అంకెలు పెంచడమే తప్ప.. ఆచరణ సాధ్యంకాని బడ్జెట్‌గా ప్రకటనలో అభివర్ణించారు. గత బడ్జె ట్ సమయంలో రెవెన్యూ మిగులు ఉంటుందని భా వించినప్పటికీ.. రూ.2,783 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా 10,566 కోట్ల రెవెన్యూలోటు కనిపిస్తున్నదని, ఆ లెక్కలను ప్రభుత్వం కచ్చితంగా చూపడం లేదని తెలిపారు. ఒకవైపు జీడీపీ, తలసరి ఆదాయం పెరిగాయని చెప్తున్నప్పటికీ.. అది వాస్తవం కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రజల వద్ద సంపద లేదని, కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఆ సంపద ఉన్నదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి తూట్లు పొడిచిందని, ఆరు గ్యారెంటీల ప్రస్తావన ఈ బడ్జెట్లో తేలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో సంపద సృష్టి గత కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్తు గ్రిడ్ల వంటి సంపదను సృష్టించే శాశ్వత నిర్మాణాలను చేపట్టారని పాపారావు గుర్తుచేశారు. ఎస్టీవో రూ.29,288 కోట్ల నుంచి రూ.1,00,694 కోట్లకు పెరిగిందని వివరించారు. విద్యారంగాన్ని ఉద్ధరిస్తున్నామని విద్యా కమిషన్ ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ కమిషన్ విద్యారంగానికి ఇచ్చిన సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.