పటాన్చెరు, సెప్టెంబర్ 1: ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాని కిషన్‌రావు (86) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో మరణించారు. 1938లో పటాన్చెరు పట్టణ సమీపంలోని మన్మూల్లో జన్మించారు. ఎంబీబీఎస్ చదివి 1977లో పటాన్చెరులో యశోద దవాఖాన ఏర్పాటు చేశారు. 1980 నుంచి ఏర్పాటు చేసిన పరిశ్రమలు తీవ్రస్థాయిలో కాలుష్యం వదలడంతో ఆయన పోరుబాట పట్టారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. 1986లో ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి మార్గదర్శకత్వంలో డాక్టర్ కిషన్‌రావు సిటిజన్స్ ఎగెనెస్ట్ పొల్యూషన్ ఫోరంలో చేరారు. పటాన్చెరు-బొల్లారం కాలుష్యాన్ని వెలుగులోకి తెచ్చి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేశారు.
ప్రముఖ పర్యావరణవేత్త దివంగత చిదంబరంతో కలిసి ప్రజా ఉద్యమాలను నిర్వహించారు. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కాలుష్య నివారణకు అనేక ఆర్డర్లు తీసుకొచ్చి కాలుష్య పీడిత గ్రామాలకు ఉచితంగా తాగునీరు అందేలా కృషిచేశారు. ‘పటాన్చెరు ఏ హెల్ ఆన్ ఎర్త్’ పుస్తకాన్ని రాసి అంతర్జాతీయ సింపోజియమ్లలో పత్రాలను సమర్పించారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు అందజేయాలని పారిశ్రామికవేత్తలతో, ప్రభుత్వాలతో పోరాటం కొనసాగించారు. వృద్ధాప్యం రావడంతో ఆయన నందిగామ గ్రామం కేంద్రంగా గోశాల ఏర్పాటు చేసి గోవులకు సేవలందిస్తూ జీవించారు. ఈ ఏడాది జూలై 5న డాక్టర్ కిషన్‌రావుకు నల్సార్ యూనివర్సిటీ ఎర్త్ ఎన్విరాన్మెంట్ నేషనల్ అవార్డును అందజేసింది. అనారోగ్యంతో ఆయన మంచానికే పరిమితం కావడంతో ఆయన సోదరుడు అవార్డును స్వీకరించారు. డాక్టర్ కిషన్‌రావు మృతిపై పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.