హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించిన దక్షిణాది రాష్ర్టాల జోనల్ కౌన్సిల్ స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లుగా రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఆగస్టులో నిర్వహించనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం ఎజెండాకు సంబంధించి తెలంగాణ తరపున పలు ప్రతిపాదనలు చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల ప్రకారం నీటి వాటాల కోసం ట్రిబ్యునల్‌కు నివేదించడం, పోలవరం-పట్టిసీమ ద్వారా ఏపీ తరలిస్తున్న జలాలకు సంబంధించిన వాటా, ఆర్డీఎస్ ఆధునికీకరణ, కృష్ణానదిపై ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు, కాళేశ్వరంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలను ఎజెండాలో చేర్చాలని ప్రతిపాదించారు.
ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, బయ్యారం ఉకు కర్మాగారం, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే, జాతీయ రహదార్ల నిర్మాణం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, బకాయిల పంపిణీ, పోలవరం ముంపు నుంచి తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ తదితర అంశాలనూ ఎజెండాలో పొందుపరచాలని కోరారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి మొత్తం 89 అంశాలను ప్రతిపాదించగా అందులో 65 అంశాలతో కౌన్సిల్ ఎజెండాను ఖరారు చేశారు.