హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : చరిత్ర తెలుసుకోవడం అందరికీ ఆసక్తే. కానీ నేటి బీజీ లైఫ్‌లో అటువైపు చూడటం లేదు. పుట్టిన సొంత గ్రామం నేపథ్యం.. దాని చరిత్ర, వనరులు, స్థానిక మహనీయుల పేర్లు నేటితరానికి చాలావరకు తెలియడం లేదు. ఈ తరుణంలో ఎవరి ఊర్ల ఉనికి, చరిత్రను వారే రికార్డుచేసే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘మన ఊరు – మన చరిత్ర’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. డిగ్రీ తృతీయ సంవత్సరంలోని విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఊరి చరిత్ర రాసే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు తమ గ్రామంలోని 70 నుంచి 80 ఏండ్ల వారిని, స్వాతంత్య్ర సమరయోధులను సంప్రదించి, గ్రామం తాలూకు చరిత్రను రికార్డు చేయాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల వనరులు, జీవన విధానం, చరిత్రను రికార్డుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో డిగ్రీ కాలేజీలో ఐదారుగురు లెక్చరర్లతో కమిటీ నియమించారు. జిల్లాకొక కో ఆర్డినేటర్‌ను నియమించారు. ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేసిన విద్యార్థులకు క్రెడిట్స్‌ను జారీచేసే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
మన ఊరు – మన చరిత్ర అద్భుత కార్యక్రమం. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్నింటీని విస్మరిస్తున్న క్రమంలో మన గ్రామ చరిత్రను మనమే రాసుకోవడం గొప్ప విషయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటి వరకు చిన్న ఓదెల, పెద్ద ఓదెల, అడవి శ్రీరాంపూర్, వీర్నపల్లి, కనగర్తి గ్రామాల చరిత్రను రికార్డుచేశాం. ప్రస్తుతానికి విద్యార్థులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నాం. మార్చిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు ఊర్లకు వెళ్తారు. ఈ సెలవు రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి పూర్తిచేసేలా ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులు ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపుతున్నారు.
– సంపత్ కుమార్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్
కన్నతల్లి లాంటి ఊరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచి జీవన విధానానికి కేరాఫ్ అడ్రస్ అయిన గ్రామాల చరిత్రను, వారసత్వాన్ని ముందు తరాలకు అందించే గొప్ప ప్రయత్నమిది. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనారావుపేట మండలంలోని కనగర్తి గ్రామ చరిత్రను లిఖించే ప్రయత్నం చేశాను. మనుషుల మధ్య ప్రేమలు కలగలిపిన బంధాలు, వరుసలు పెట్టి పిలుచుకొనే సంప్రదాయాలకు.. సబ్బండ కులాల సహజీవనానికి అక్షరరూపమిచ్చాను.
-లింగంపల్లి మనోజ్‌కుమార్, పూర్వ విద్యార్థి, రాజన్నసిరిసిల్ల జిల్లా
మాది పెద్దపల్లి జిల్లా పెద్ద ఓదెల. ఉన్నత చదువుల కోసం కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో చేరాను. కరోనా సమయంలో అధ్యాపకుడు సంపత్‌కుమార్ ప్రోత్సాహంతో గ్రామ చరిత్రను రాసే ప్రయత్నం చేశా. మా ఊరి చరిత్ర, పొలిమేరలను స్థానిక పెద్దలను అడిగి తెలుసుకున్నా. ఈ ప్రాజెక్ట్ ద్వారా పూర్వీకులు, మరుగున పడ్డ చరిత్ర వెలుగులోకి వచ్చాయి. మా గ్రామానికున్న ప్రత్యేకతలు, విశిష్టతను నమోదు చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.
– బుద్ధార్థి సంధ్యారాణి, మహిళా డిగ్రీ కాలేజీ, కరీంనగర్.
మాది సిద్దిపేట జిల్లా కొండపాక మండంలోని మంగోలు గ్రామం. మా ఊరి చరిత్రను, వారసత్వాన్ని వెలుగులోకి తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నా. మా గ్రామంలోని యాచకులైన కళాకారుల గురించి అధ్యయనం చేశా. ఊరివాడలకు, పొలిమేర్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో గ్రామ పెద్దల ద్వారా తెలుసుకొన్నా. ఈ ప్రయత్నంతో ఊరి చరిత్రను సజీవంగా ఉంచవచ్చనే నమ్మకం కలిగింది.
– దాసరి హైమావతి, బీఎస్సీ విద్యార్థి, సిద్దిపేట జిల్లా