హైదరాబాద్: అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా (Professor Saibaba) నిమ్స్ దవాఖానలో చికిత్సం పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్ వైద్యులు ఆయన పార్థివదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి గన్‌పార్క్‌కు తరలించారు. ఉద్యమ సహచరుల సందర్శనార్థం అక్కడ పావుగంటపాటు ఉంచనున్నారు. అనంతరం మౌలాలిలోని నివాసానికి తరలిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీనివాస హైట్స్ నుంచి సాయిబాబా అంతిమయాత్ర ప్రారంభంకానుంది. ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కి దానమిచ్చారు.
పేద రైతు కుటుంబంలో జన్మించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 1967లో పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబా పోలియో వ్యాధి బారిన పడటంతో ఐదేండ్ల వయసు నుంచే వీల్‌చైర్‌ను ఉపయోగిస్తున్నారు. వారి గృహానికి కనీసం విద్యుత్తు సౌకర్యం కూడా లేదు. అయినా 90% వైకల్యంతో బాధపడుతూనే ఎంతో కష్టపడి చదివారు. అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసిన ఆయన.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లోనూ విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించి అక్కడే ఎన్నో ఎండ్లుగా పనిచేశారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు. అమలాపురంలో డిగ్రీ చదువుతున్నప్పుడే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులైన సాయిబాబా.. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్‌లో చేరారు. 1992లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివేటప్పుడే ఏఐఆర్‌పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శిగా నియమితులైన సాయిబాబా.. 1995 నాటికి ఆ సంస్థలో జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఆర్డీఎఫ్ అనే సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. ఇవన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలేనని పోలీసులు చెప్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి అనే మావోయిస్టులను అరెస్టు చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా సహకారంతో మావోయిస్టు నేతలను కలిసేందుకు వెళ్తున్నట్టు పోలీసులకు వారు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో 2013 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014 మే నెలలో ఆయనను అరెస్టు చేశారు. వైద్య కారణాల రీత్యా 2015 జూన్‌లో సాయిబాబాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అదే ఏడాది డిసెంబర్లో మళ్లీ జైలుకు వెళ్లారు. దీంతో 2016 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2017 మార్చిలో సాయిబాబా కేసు దర్యాప్తును చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 13, 18, 20, 39 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతోపాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. దీంతో ఢిల్లీ వర్సిటీలోని రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి 2021 ఫిబ్రవరిలో సాయిబాబాను తొలగించారు.
2014 నుంచి 3,588 రోజులపాటు జైలులోనే ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదురొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలు చుట్టుముట్టాయి. వీటితోపాటు హృద్రోగ సమస్యలు కూడా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు విప్లవ రచయితర సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్యం దెబ్బతినడంతో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత 2022 అక్టోబర్‌లో బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడంతో సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టు 2022 అక్టోబర్‌లో స్టే ఇచ్చింది. ఆ కేసులో మహారాష్ట్ర సర్కారు వాదనను తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు ఆయనను మరోసారి నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.