ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి పూర్తిస్థాయి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం జీవో జారీచేశారు.
- వైస్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్కే మహమూద్
- మూడేండ్ల కాలానికి నియామకం
- విద్యాశాఖ కార్యదర్శి కరుణ జీవో జారీ
- రాష్ట్రంలో దళిత, మైనార్టీ
- వర్గాలకు సముచిత స్థానం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి పూర్తిస్థాయి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం జీవో జారీచేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. 2021 ఆగస్టు 24న ఉన్నత విద్యామండలి ఆఫిషియేట్ చైర్మన్‌గా (తాత్కాలిక హోదా) నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి వైస్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గత రెండేండ్లుగా ఆయన చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి చైర్మన్ హోదాను కట్టబెట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఈ జూలైలో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి పూర్తిస్థాయి చైర్మన్ హోదా లభించడం విశేషం.
సంక్షేమ హాస్టల్లో చదువుకుని..
ప్రొఫెసర్ లింబ్రాది స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ఆయన పాఠశాల విద్యను సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలను పుచ్చుకున్నారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయన 28 ఏండ్లపాటు బోధనా వృత్తిలో రాణించారు. గతంలో సికింద్రాబాద్ పీజీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా, బీవోఎస్ డైరెక్టర్‌గా, అకాడమిక్ ఆడిట్‌సెల్ జాయింట్ డైరెక్టర్‌గా సేవలందించారు. రెండుసార్లు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఓయూ శతాబ్ది ఉత్సవాల సమయంలో ఓయూ వీసీ ఓఎస్డీగా పనిచేశారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్‌గా విజయవంతంగా సేవలందించారు. ఇటీవలీ కాలంలో పేపర్ లీకేజీల గందరగోళ పరిస్థితుల్లోనూ ఎంసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్ వంటి ఏడు రకాల ప్రవేశపరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలకపాత్ర పోషించారు.
మారుమూల గ్రామం నుంచి ఉన్నత విద్యామండలికి
పేరు: ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
స్వస్థలం: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల
పీహెచ్డీ: ఓయూ నుంచి 1993లో
ఎంఫిల్: ఓయూ నుంచి 1990లో
పీజీ: ఓయూ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
నిర్వహించిన పదవులు
ఉన్నత విద్యామండలి అఫిషియేట్ చైర్మన్: 23 -8 -23 నుంచి ఇప్పటివరకు
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్: 7-8- 2017 నుంచి 22-8-23
ఓయూ వీసీ ఓఎస్డీ: 6-12-2016 నుంచి 6-8- 2017
తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్: 4-4-2013 నుంచి 4-7-2014, తిరిగి 27-11 -2014 నుంచి 28-7-2016
తెలంగాణ వర్సిటీలో సోషల్ సైన్సెస్ డీన్: 2015 మార్చి నుంచి 2017 సెప్టెంబర్ వరకు
విద్యారంగ అభివృద్ధికి అంకితమవుతా
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, తెలంగాణను దేశంలోనే ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషిచేస్తాను. యూనివర్సిటీలు సహా తెలంగాణ ఉన్నతవిద్యను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు, ఉన్నత విద్యామండలి ఉన్నతిని, ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషిచేస్తాను. సీఎం కేసీఆర్ దార్శనికత, ఆశయాల మేరకు శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను అందుబాటులో తీసుకొస్తాం. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుని, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానం కల్పించే కోర్సులను ప్రవేశపెడతాం. -ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
వైస్ చైర్మన్‌గా డాక్టర్ ఎస్కే మహమూద్
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా నియమితులైన డాక్టర్ ఎస్కే మహమూద్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జూపల్లి గ్రామం. ఓయూ బాటనీ విభాగం హెచ్వోడీగా పదవీ విరమణ పొందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఎమ్మెస్సీ, పీహెచ్డీ, బయో ఇన్ఫర్మేటిక్స్లో అడ్వాన్స్డ్ డిప్లొమా పూర్తిచేసిన మహమూద్ 31 ఏండ్లుపాటు బోధనారంగంలో పనిచేశారు. గతంలో సైఫాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, ఓయూ బాటనీ డిపార్ట్మెంట్ హెచ్వోడీగా సేవలందించారు. 1989లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై 1998లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. తాజా నియామకాలతో ఉన్నత విద్యామండలిలో దళిత, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించినట్టయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

