హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): భారత ఉపఖండంలో నూతన సామాజిక ఉద్యమాలకు డాక్టర్ బీఆర్ అబేంద్కర్ పునాదిగా నిలుస్తున్నారని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ దొంత పేర్కొన్నారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం మంచి నిర్ణయమని, సమతా విధానాన్ని చాటిచెప్పే ఈ విగ్రహాన్ని యావత్ దేశానికే స్ఫూర్తిగా నిలిచేలా అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘సామాజిక, రాజకీయ ఉద్యమాలు-అంబేద్కర్ దృక్పథం’ అనే అంశంపై హైదరాబాద్లోని దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. రైతులు, కూలీలు, కార్మికుల్లాంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం 1929 నుంచి 1937 వరకు అంబేద్కర్ సమగ్ర ఉద్యమాలను నిర్మించారని తెలిపారు. 1945లో పీపుల్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశారని, అనంతరం మహారాష్ట్రలో మిలింద్ మహా విద్యాలయాన్ని ప్రారంభించి అనేక మందికి విద్యాబోధన చేయించారని గుర్తుచేశారు. హైదరాబాద్లోని ప్రముఖ సంఘసంస్కర్తలు మాదరి భాగ్యరెడ్డివర్మ, బీఎస్ వెంకట్రావ్ లాంటివారు అంబేద్కర్ సామాజిక ఉద్యమాల వారసత్వాన్ని కొనసాగించారని చెప్పారు. కార్యక్రమంలో పలు యూనివర్సిటీలు ప్రొఫెసర్లు, నాయకులు, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.