Professor Kodandaram | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచీ వినయ విధేయ భక్తుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, దీన్ని గవర్నర్ ఆమోదించినట్టే ఆమోదించటం, ఆలోగానే న్యాయపరమైన చిక్కులతో ఆగిపోవటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది. కోదండరాంను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయటం ద్వారా ఉద్యమకారుడిని గౌరవించినట్టు, తామే ఉద్యమకారులకు న్యాయం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన విస్తుగొలుపుతున్నది.
కాంగ్రెస్ వాదన ఎంతవరకు నిజం? ఇందులో దాగిన మర్మం ఏమిటి? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో ఉద్యమకారులపై విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ నాయకగణం కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ద్వారా ఏం చెప్పదలచుకున్నది? కోదండరాంకు పదవి ఇచ్చేయటం ఉద్యమకారులను గౌరవించినట్టా? అసలు కోదండరాం పదవి ఉద్యమకారుల కోటాలో వచ్చిందా? ఇంకేమన్నా ఉన్నదా? వంటి అనేక అంశాలపై మేధావి వర్గాల్లో లోతుగా చర్చ మొదలైంది.
కోదండరాంను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయటం వెనుక ఆసక్తికర పరిణామాలే ఉన్నాయి. ఆ పరిణామాలు ఇప్పటివి మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు. ఆ తరువాత ఒకటొకటిగా పెనవేసుకున్న బంధాల సమాహారం. కోదండరాంకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మిత్రుత్వ నేపథ్యాన్ని అవగతం చేసుకుంటే తప్ప ఇప్పుడేం జరుగుతున్నదో అర్థం కాదన్నది రాజకీయ వర్గాల అంతర్, బహిర్ విశ్లేషణ.
అసలేం జరిగింది?
కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వటం వెనుక కాంగ్రెస్ కపట నేపథ్యం, అందుకు సహకరించిన కోదండరాం కుటిలత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప అసలు విషయం బోధపడదని మేధావి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే కాని అర్థం కాదన్నది ఆ వర్గాల సూత్రీకరణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సకుటుంబ సపరివారంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీలో నాటి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ప్రతిపాదనను సోనియా ముందుంచారు.
విలీన ప్రతిపాదనను లెక్కచేయందెవరు?
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేసేముందు సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌తో కేసీఆర్ రెండు ప్రధాన ప్రతిపాదనలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలతోపాటు తెలంగాణ వాదాన్ని బలపరచి, నడిచిన ఉద్యమకారులు ఉన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ నేతలకు, అటు ఉద్యమకారులకు సముచిత పదవులను ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఆ ప్రతిపాదన అనంతరం సోనియాగాంధీ అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ’దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడుకోండి’ అని అత్యంత అప్రధాన్య అంశంగా, కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై నీళ్లు చల్లేలా వ్యవహరించారని అప్పట్లో జాతీయ మీడియాతోపాటు తెలుగు మీడియాలోనూ కథనాలు వచ్చాయి.
సోనియాగాంధీ అంత నిర్లక్ష్యంగా, పట్టీపట్టనట్టు వ్యవహరించినాసరే తన జీవిత లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తరువాత, ఆ లక్ష్యం కోసం ఏర్పాటైన పార్టీని కృతజ్ఞతాపూర్వకంగా కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్ భావించటం వల్లే ఆమె చేసిన సూచనకు అనుగుణంగా దిగ్విజయ్‌సింగ్ దగ్గరికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ విలీనంపై చర్చించాలని భావించారు.
సోనియాగాంధీతో చేసిన ప్రతిపాదనలే దిగ్విజయ్‌సింగ్‌తో చేశారు. తమను, పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏ స్థాయిలో గుర్తింపు, గౌరవం కోరుకున్నారో విలీనం తర్వాత కూడా అదే స్థాయిలో ఉద్యమకారులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ ప్రతిపాదనలపై మాట వరుసకు కూడా చర్చించకుండా ‘ఎలాంటి షరతుల్లేకుండా (అన్కండిషనల్గా) పార్టీని విలీనం చేయండి. ఏం చేయాలో మాకు తెలుసు’ అన్న ఆధిపత్యధోరణితో దిగ్విజయ్‌సింగ్ వ్యవహరించారు.
తనతో నడిచిన పార్టీ నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు, ఉద్యమకారుల ఆకాంక్షలను పణంగా పెట్టి షరతుల్లేని విలీనం చేస్తే సముద్రంలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడటం, ఏది కావాలన్నా చేయిచాచి అడుక్కోవాల్సిన దుస్థితే ఎదురవుతుందన్న ఉద్దేశంతో, కాంగ్రెస్ చారిత్రక నేపథ్యాన్ని అవగతం చేసుకున్న వ్యక్తిగా కేసీఆర్ విలీనం అయ్యే పనికాదని సొంతంగానే ఎన్నికలను ఎదుర్కొన్నారు.
ఉద్యమకారుల కోటాలో కానేకాదు
కోదండరాం తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నది కాదనలేని సత్యం. కోదండరాంను జేఏసీ చైర్మన్‌గా ప్రతిపాదించి, పట్టుబట్టి చేసిందే కేసీఆర్. అది చెరిపేసినా చెరగని కఠోర నిజం. అది కోదండరాంకూ తెలుసు. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం చేపట్టిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ఉధృతంగా పాటించిన మాట నిజం. ఇవ్వాళ కూడా కోదండరాం విద్యాధికులుగా, ప్రొఫెసర్‌గా ఎమ్మెల్సీ పదవికి అర్హుడే కావచ్చు. ఉద్యమకారుడిగా కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వటంలో తప్పు లేకపోవచ్చు.
ఎమ్మెల్సీగా ఎవర్ని సెలక్ట్ చేసుకోవాలనే స్వేచ్ఛ అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్నది నూటికి నూరుశాతం నిజమే కావచ్చు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఏదో ఉద్యమకారులను గౌరవించినట్టు ఫోజులు కొట్టడం అనేది సరి కాదన్న అభిప్రాయం తెలంగాణవాదుల్లో వ్యక్తమవుతున్నది. కోదండరాంకు ఉద్యమకారుడి కోటా లో ఎమ్మెల్సీ పదవి రాలేదనేది నిప్పులాంటి నిజం.
గత పదేండ్లుగా ఒక వ్యక్తిగా, జనసమితి పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన మద్దతుకు, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటమే కాకుండా ఆ పార్టీకి ఇచ్చిన మద్దతుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చిందే తప్ప ఉద్యమకారుడి కోటాలోనో, త్యాగపురుషుడనే కోటాలో ఇవ్వలేదన్నది నిష్టూరసత్యం. ఒకవేళ కోదండరాం మీద కాంగ్రెస్‌కు అంత గౌరవమే ఉంటే ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీని చేసి ఉండేది. వివాదాస్పదమైన గవర్నర్ కోటాలో ఇచ్చి ఉండేది కాదు. కోదండరాంకు ఉన్న ఇమేజ్ను వాడుకోవటం, ఆయన పేరుతో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడమే కాంగ్రెస్ ఉద్దేశం తప్ప ఉద్యమకారులను గౌరవించటం కాదన్నది దీంతో విష్పష్టంగా తెలుస్తున్నది.
పరకాల ఉప ఎన్నికలోనూ మౌన కోదండం
తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో.. పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికకూ అంతే ప్రాధాన్యం ఉన్నది. పరకాల ఉప ఎన్నిక సమయంలో సర్వ తెలంగాణ ఏకమై టీఆర్ఎస్ గెలుపు కోసం నెత్తురు ఉగ్గపట్టేలా కొట్లాడుతుంటే నాటి జేఏసీ ప్రేక్షకపాత్ర పోషించింది. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం పరకాల ఉప ఎన్నికల్లో జేఏసీ ఎటువైపు ఉండాలో ఒక్క పిలుపు ఇవ్వలేదు. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ పాపిరెడ్డిపై ఒత్తిడి తెస్తే, ఆయన ప్రొఫెసర్ కొదండరాంతో విబేధించి వరంగల్ జేఏసీ పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. వ్యక్తిగత ప్రతిష్ట, ప్రయోజనాల కోసం కోదండరాం ఏమైనా చేస్తారు.. అవసరమైతే మౌనం దాలుస్తారు అనటానికి పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ఆయన పోషించిన పాత్రను ఉద్యమకారులు గుర్తుచేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలై, బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని గ్రహించిన కోదండరాం, కాంగ్రెస్ పార్టీతో ముందే లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. కోదండరాం ఢిల్లీకి వెళ్లి రహస్యంగా సోనియాగాంధీని కలిశారని 2013 ఆగస్టు 16న ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా కథనం ప్రచురితమైంది. 17వ తేదీన ఆ వార్తను కోదండరాం ఖండించారు. తాను ఢిల్లీయే వెళ్లలేదని బుకాయించారు.
ఆ మరుసటి రోజు అంటే 2013 ఆగస్టు 18న కోదండరాం ఖండన వార్తతోపాటు ఆయన ఢిల్లీకి వెళ్లిన విమాన టికెట్ల (నంబర్లతో)తో సహా అదే ఆంధ్రజ్యోతి పత్రిక మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో కాంగ్రెస్‌కు, కోదండరాంకు ఉన్న అనుబంధం ఆనాడే బయటపడింది. ఢిల్లీలో సోనియాగాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యనేతలతో రహస్య భేటీ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమకారుల ప్రయోజనాల కోసం ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ సొంతంగా ఎన్నికల బరిలో నిలిస్తే కోదండరాం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్‌లో స్వయంగా ప్రచారం చేశారు. 2014, 2018 రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అను‘బంధు’డిగా స్థిరపడిపోయారు. కోదండరాంను జేఏసీ చైర్మన్‌ను చేసింది కేసీఆర్ అయితే, ఆయన మనసు మాత్రం కాంగ్రెస్‌తోనే ఉన్నది. తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని ఆయన బలంగా నమ్మారు కానీ, తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతలను తెలంగాణ సమాజం, టీఆర్ఎస్, కేసీఆర్ సృష్టించారనే చిన్న లంకెను మిస్ అయ్యారని తెలంగాణ వాదుల అభిప్రాయం.
కేసీఆర్ తన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తుతోపాటు ఉద్యమకారులకు సరైన గౌరవం, గుర్తింపు కావాలని ఆరాటపడ్డారు. వీటికన్నా మిన్నగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలని తపించారు. కానీ, కోదండరాం మాత్రం కాంగ్రెస్‌తోనే తన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని నమ్మారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అది నిజమేనని అనంతర పరిణామాలే నిరూపిస్తున్నాయి.